ఎదురు చూపులు నెల రోజులే..

కథనాలు

Updated : 04/09/2020 17:35 IST

ఎదురు చూపులు నెల రోజులే..

ఉందిగా సెప్టెంబర్‌.. మార్చి పైనా!

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ జోరు ఆస్వాదించాలంటే నాలుగేళ్లు వేచిచూడాలి. టీ20 ప్రపంచకప్‌ హోరు వీక్షించాలంటే రెండేళ్లు ఆగాలి. అంతకు మించిన ఆనందం, ఆహ్లాదం, ఉత్సాహం, ఉత్కంఠను అనుభవించాలంటే ఏటా 10 నెలలు ఆగితే చాలు! ఎందుకంటే ప్రతి మార్చిలో అభిమానుల కోసం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వచ్చేస్తుంది. కానీ కరోనాతో ఆటగాళ్లు, అభిమానుల హుషారుకు బ్రేకు పడింది.

మార్చిపోతే సెప్టెంబర్‌ ఉందన్నట్టు సెప్టెంబర్‌ 19న టోర్నీ మొదలవుతుందని ప్రకటించగానే ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ అన్నట్టుగా ఉత్సాహం వచ్చేసింది. కళ్లు చెదిరే ఆ సిక్సర్లు.. అద్భుతమైన బంతులకు ఎగిరిపోయే వికెట్లు... ఔరా! అనిపించే క్యాచులు.. గుండె లయను పెంచే ఉత్కంఠను ఆస్వాదించేందుకు ఇప్పుడు వేచి చూడాల్సిన సమయం మరో నెల రోజులే!!


సూపర్‌ టైమింగ్‌!

‘నేను టైమ్‌ను నమ్మను.. నా టైమింగ్‌ను నమ్ముతాను’ అన్న డైలాగ్‌ ఐపీఎల్‌-2020కి సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే రోజూ కరోనా.. కొవిడ్‌.. బాధితులు.. మరణాలు.. మాస్క్‌లు.. దూరం..దూరం.. వంటి పదాలు వింటూ, చదువుతూ జీవితం భయానకంగా మారింది! అలాంటి సమయంలో జనాలకు ఈ పొట్టి క్రికెట్‌ వేడుక కాస్త ఉపశమనం ఇవ్వనుంది. అందుకే గతానికి భిన్నంగా అత్యధికమంది వీక్షించిన ఐపీఎల్‌గా ఈటోర్నీ నిలిచిపోతుందని కింగ్స్‌ XI పంజాబ్‌ సహయజమాని నెస్‌వాడియా వంటివారు అంచనా వేస్తున్నారు. మనసుకు మనోరంజనం కరవైన ఈ కాలంలో ఐపీఎల్‌ ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం అభిమానులు అర్రుల సాచే అవకాశం నిజంగానే ఉంది. ఆందోళన.. భయంతో.. రోజంతా పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పుడిదే ప్రధాన వినోదంగా మారనుంది.


అంతా భిన్నం

గతంలో పోలిస్తే ఈ ఐపీఎల్‌ భిన్నంగా ఉండనుంది. మైదానాల్లో అల్లరి చేస్తూ ఈలలు వేస్తూ ఎగిరి గంతులు వేసేందుకు అభిమానులు ఉండరు. ఆటగాళ్లు ఒకరినొకరు ముట్టుకొనేందుకు అవకాశం లేదు. బంతిపై ఉమ్మి రాయకుండానే స్వింగ్‌ చేయాలి. ప్రత్యర్థి ఔటైనా సరే జబ్బలు చరుచుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకొంటూ ఆనందాన్ని పంచుకొనే పద్ధతి లేదు. గెలిచినా.. ఓడినా అవతలి జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదు. క్రికెటర్ల సతీమణులు, పిల్లల సందడి గ్యాలరీల్లో కనిపించదు. మీడియాతో మాట్లాడొద్దు. ఒకవేళ మాట్లాడినా భౌతికదూరం తప్పదు. మ్యాచులు ముగిశాక ఆటగాళ్లు హోటల్‌ గదుల్లో ఏకాంతంలోకి వెళ్లిపోవాలి. ఎవరినీ కలవొద్దు. కఠిన నిబంధనలు పాటించాలి. దానికి తోడు ప్రతి ఐదు రోజులకు కొవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలి. 400 మందితో ఏర్పాటయ్యే ఈ బయో బుడగ ఎంత పటిష్ఠంగా ఉంటుందో చూడాలి.


53 రోజుల పండగ

సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌-2020 జరుగుతుంది. అబుదాబి, షార్జా, దుబాయ్‌లో మ్యాచులు జరుగుతాయి. మొత్తం 53 రోజుల టోర్నీ. 10 డబుల్‌ హెడర్స్‌ (రోజుకు రెండు మ్యాచులు). గతానికి భిన్నంగా మ్యాచులు అరగంట ముందే ఆరంభం అవుతాయి. రాత్రివేళ మ్యాచ్‌ 7:30 గంటలకు, సాయంత్రం మ్యాచ్‌ 3:30 గంటలకు మొదలవుతాయి. సాధారణంగా ఏటా జరిగే ఐపీఎల్‌ సమయంలో ఉగాది పండగను జరుపుకుంటాం. ఈ సారి కీలకమైన దసరా, దీపావళి జరుపుకోనున్నాం. సినిమా థియేటర్లు తెరవడంపై స్పష్టత లేదు కాబట్టి బహుశా పండుగ దినాల్లో ఇక క్రికెట్టుతోనే ఎంటర్‌టైన్‌మెంట్‌! మహిళల ఐపీఎల్‌ జరుగుతుందని చెప్పడంతో మూడు జట్లతో అమ్మాయిలు సైతం సందడి చేయనున్నారు.


బీసీసీఐ హ్యాపీ?

బీసీసీఐకి ఓ తలనొప్పి వదిలింది. వివో బదులు మరో టైటిల్‌ స్పాన్సర్‌ దొరికేశారు. టాటాసన్స్‌, అన్‌అకాడమీ, పతంజలి వంటి సంస్థలతో పోటీపడి ఫాంటసీ క్రికెట్‌ లీగ్‌ ‘డ్రీమ్‌ ఎలెవన్‌’ రూ.222 కోట్లకు హక్కులు దక్కించుకుంది. వివో చెల్లించే రూ.444 కోట్లలో ఇది సగం మొత్తం. ఇందులో సగం వాటా ఫ్రాంచైజీలకు పంచుతారు. అయితే గేట్‌మనీ నష్టాన్ని ఫ్రాంచైజీలు ఎలా పూడ్చుకుంటాయో చూడాలి. గతంతో పోలిస్తే ఈ సారి నిర్వహణ ఖర్చులు భారీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్‌లో తక్కువ ధరలోనే బస, ప్రయాణాలు చేయొచ్చు. యూఏఈలో రవాణా ఖర్చులు లేనప్పటికీ ఆతిథ్యం కోసం ఎక్కువే పెట్టాల్సి రావొచ్చు. ఎందుకంటే కొవిడ్‌-19 ముప్పు వల్ల ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా అపార్ట్‌మెంటులు, విల్లాలు, రిసార్టులు బుక్‌ చేశాయి. ప్రత్యేకంగా నెట్‌బౌలర్లను పిలుస్తున్నాయి. వంటవాళ్లను సైతం ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాయి. ప్రతి జట్టుకూ ప్రత్యేకంగా వైద్యబృందాలు ఉండనున్నాయని సమాచారం.


ఆటగాళ్లకూ  వింతగానే

ఆటగాళ్లకు ఈ ఐపీఎల్‌ వింత అనుభవమే ఇవ్వనుంది. ఇంటికి దూరంగా ఉండాలి. ఎవరినీ కలిసేందుకు వీల్లేదు. పదేపదే పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదంతా వారిని మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ ఫీలింగ్‌ నుంచి వారిని దూరం చేసేందుకు ఫ్రాంచైజీలు భిన్నంగా ఆలోచించాల్సి తీరాల్సిందే. ఇకపోతే అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను శిబిరాలకు తీసుకొచ్చాయి. బెంగళూరు, ముంబయి, దిల్లీ నగరాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. దుబాయ్‌ విమానం ఎక్కే ముందు 24 గంటల వ్యవధిలో వీరు రెండు ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగెటివ్‌ వస్తేనే ప్రయాణం. లేదంటే ఇక్కడే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండి మళ్లీ పరీక్షలు చేయించుకొని వెళ్లాలి. అయితే ముందు జాగ్రత్తగా ఫ్రాంచైజీలు రెండు కన్నా ఎక్కువే టెస్టులు చేస్తున్నాయి. ఆగస్టు 20 తర్వాత ఒక్కో జట్టు ప్రత్యేక విమానంలో దుబాయ్‌ చేరుకుంటాయి. అక్కడ సాధన చేస్తూనే క్వారంటైన్‌ అవుతాయి. ఇకపోతే కొందరు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండకపోవచ్చు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన