Sachin: 200 కొట్టకముందే హెచ్చరించాడు.. 

కథనాలు

Updated : 30/05/2021 09:29 IST

Sachin: 200 కొట్టకముందే హెచ్చరించాడు..  

ఉప్పల్‌లో ఆస్ట్రేలియాపై వన్‌ మ్యాన్‌ షో..!

క్రికెట్‌లో టీమ్‌ఇండియా మాజీ సారథి సచిన్‌ తెందూల్కర్‌ సాధించని రికార్డు లేదు! ప్రత్యర్థి ఎంత బలమైన జట్టు అయినా.. బౌలర్‌ ఎంతటి కఠినాత్ముడైనా అదరక బెదరక బ్యాటింగ్‌ చేయడమే మాస్టర్‌ బ్లాస్టర్‌ ప్రత్యేకత. ఈ క్రమంలోనే సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాడు. క్రికెట్‌ చరిత్రలో వన్డే ఫార్మాట్‌లో ఎవరైనా ద్విశతకం సాధిస్తారా అనుకునే రోజుల్లో ఆ ఘనత సాధించి యావత్‌ ప్రపంచాన్ని మైమరపించాడు. అయితే, అంతకు నాలుగు నెలల ముందే 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆ రికార్డు చేరుకుంటానని సచిన్‌ చెప్పకనే చెప్పాడు. ఆ విశేషాలేంటో ఓసారి తెలుసుకుందాం..


సచిన్‌ ఉద్దేశం..

ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా రికీ పాంటింగ్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు 2009 అక్టోబర్‌-నవంబర్‌ కాలంలో భారత పర్యటనకు వచ్చింది. అప్పుడు హైదరాబాద్‌ వేదికగా జరిగిన ఐదో వన్డేలో కంగారూలు 3 పరుగుల తేడాతో విజయం సాధించారు. కానీ, ఆ మ్యాచ్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించాడు. 350 పరుగుల భారీ లక్ష్యంలో ఒక్కడే 175 పరుగులు బాదాడు. దాంతో మ్యాచ్‌ను గెలిపించినంత పని చేయడమే కాకుండా వన్డేల్లో ద్విశతకం చేయొచ్చనే అభిప్రాయాన్ని బలంగా కలిగించాడు.


షేన్‌, షాన్‌ షో..

అప్పటికే ఆస్ట్రేలియా, టీమ్‌ఇండియా జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలిచి జోరుమీదున్నాయి. కీలకమైన ఐదో వన్డేలో విజయం సాధించి సిరీస్‌లో ముందుకు సాగాలని ఇరు జట్లూ పట్టుదల మీదున్నాయి. ఈ క్రమంలోనే ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌(93; 89 బంతుల్లో 9x4, 3x6), షాన్‌ మార్ష్‌(112; 112 బంతుల్లో 8x4, 2x6) అద్భుతంగా ఆడారు. భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. అనంతరం రికీ పాంటింగ్‌(45; 45 బంతుల్లో 3x4, 1x6), కామెరూన్‌ వైట్‌(57; 33 బంతుల్లో 2x4, 5x6), మైఖేల్‌ హస్సీ(31*; 22 బంతుల్లో 1x4, 2x6) తలా ఓ చేయి వేయడంతో టీమ్‌ఇండియా ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.


సచిన్‌ పోరాటం..

ఛేదనలో సచిన్‌(175; 141 బంతుల్లో 19x4, 4x6) ఒంటరిపోరాటం చేశాడు. మరో ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(38; 30 బంతుల్లో 5x4, 1x6) శుభారంభం చేసినా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. ఆపై వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్టు పెవిలియన్‌ కు క్యూ కట్టారు. గంభీర్‌(8), యువరాజ్‌ ‌(9), కెప్టెన్‌ ధోనీ(6) విఫలమయ్యారు. దాంతో 162 పరుగులకే భారత్‌ నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో సచిన్‌తో జోడీ కట్టిన సురేశ్‌ రైనా(59; 59 బంతుల్లో 3x4, 3x6) అర్ధశతకంతో మెరిశాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 137 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌పై ఆశలు పెంచారు. సచిన్‌ రెచ్చిపోగా రైనా అండగా నిలిచాడు. దాంతో తెందూల్కర్‌ అప్పటికి తన వ్యక్తిగత అత్యధిక పరుగుల రికార్డు (186) బ్రేక్‌ చేసేలా కనిపించాడు. కానీ, కీలక సమయంలో ఔటవ్వడంతో మ్యాచ్‌ చేజారిపోయింది. చివర్లో రవీంద్ర జడేజా(23; 17 బంతుల్లో 3x4) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరికి భారత్‌ 49.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటై స్వల్ప తేడాతో ఓటమిలైంది.

అయితే, ఈ మ్యాచ్‌ చూసిన అభిమానులకు సచిన్ ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. అతడు ఔటయ్యే సమయానికి ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగా అప్పటికే 175 పరుగులు చేశాడు. ఒకవేళ ఔటవ్వకుండా అలాగే బ్యాటింగ్‌ చేసి ఉంటే.. అందులో కనీసం పది బంతులు ఎదుర్కొన్నా ఈ ఫార్మాట్‌లో ద్విశతకం సాధించొచ్చనే అభిప్రాయాన్ని బలంగా కలిగించాడు. ఈ నేపథ్యంలోనే నాలుగు నెలల వ్యవధిలో ఆ ఘనత సాధించి అందర్నీ ఆకట్టుకున్నాడు. 2009 నవంబర్‌లో ఆస్ట్రేలియాపై 175 పరుగులు చేసిన అతడు 2010 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాపై (200*) బాదాడు. అలా టీమ్‌ఇండియా మాజీ సారథి తాను కొట్టబోయే రికార్డును ముందుగానే హెచ్చరించాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన