‘ది ఫినిషర్‌’ ..మళ్లీ కనిపిస్తాడా?

కథనాలు

Published : 03/10/2020 08:58 IST

‘ది ఫినిషర్‌’ ..మళ్లీ కనిపిస్తాడా?

సీన్‌-2లో ధోనీపైనే ఒత్తిడి..

సీన్‌ 1: ‘ఆఖరి ఓవర్లో విజయానికి 15 పరుగులు చేయాల్సి ఉంటే.. ఒత్తిడుండేది ధోనీ మీద కాదు, బౌలర్‌ మీద’.. ఇదీ ఒకప్పుడు మహేంద్రసింగ్‌ ధోనీ గురించి క్రికెట్‌ విశ్లేషకులు గర్వంగా చెప్పిన మాటలు. అతడు క్రీజులో ఉంటే బంతి వేయకముందే సగం ఓటమి పాలైనట్టు భావించేవారు ప్రత్యర్థి బౌలర్లు.

సీన్‌ 2: ఆఖరి ఓవర్‌. పైగా అసలు అనుభవమే లేని స్పిన్నర్‌. వైడ్‌తో ఆరంభించాడు. 23 పరుగులు చేస్తే విజయం. క్రీజులో ఎంఎస్‌ ధోనీ. తొలి రెండు బంతుల్లో 2, 4. ఇక 4 బంతుల్లో 17 పరుగులే అవసరం. ప్రస్తుతం టీ20ల్లో ఈ సమీకరణం కష్టమేమీ కాదు. కానీ మూడో బంతికి మహీ సింగిల్‌ తీశాడు. ఐదో బంతికీ ఒక పరుగుకే పరిమితం అయ్యాడు. ఇంకేముంది ప్రత్యర్థి ఖాతాలో 7 పరుగుల తేడాతో విజయం.


నిజం.. కఠినమే

ఈ రెండు సన్నివేశాలను కలిపి చూస్తే తెలిసేది ఒక్కటే. ఇప్పుడు మహీ ఆఖరి ఓవర్లో క్రీజులో ఉన్నా ప్రత్యర్థికి గెలుపుపై భరోసా ఉంటోంది. అతడు షాట్లు ఆడకుండా కట్టడి చేయొచ్చన్న ఆత్మవిశ్వాసం పెరిగింది. తెలివిగా బంతులేసి సింగిల్స్‌కే పరిమితం చేయొచ్చని అర్థమవుతోంది. చురుకైన ఫీల్డర్లను పెడితే రనౌట్‌ సైతం చేయొచ్చని తెలిసిపోయింది. ఎందుకంటే.. ‘ధోనీ.. ది ఫినిషర్‌’ ఇప్పుడు అంతగా కనిపించడం లేదు! ఓడిపోయే మ్యాచుల్లో అజేయంగా నిలుస్తున్నాడు. అభిమానులు ఔనన్నా.. కాదన్నా.. గత మూడేళ్ల ప్రదర్శన ఆధారంగా విశ్లేషకులు చెబుతున్న కఠినమైన మాటలివి.


2014 తర్వాత 3 ఓటములు

బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే టీ20 క్రికెట్‌ లీగులో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై. ఇప్పటి వరకు 169 మ్యాచుల్లో 101 విజయాలు అందుకుంది. గెలుపు శాతం  60. రెండోస్థానంలోని ముంబయి కన్నా 2% ఎక్కువే. ఇక ట్రోఫీల విషయానికి వస్తే 3 సార్లు విజేతగా అవతరించింది. ఎక్కువ ప్లేఆఫ్‌లు, ఎక్కువ ఫైనళ్లు ఆడిన ఏకైక జట్టు. అసలు భీకరంగా ఆడే ధోనీసేన వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయిన సందర్భాలే అత్యంత అరుదు. అలాంటిది 2014 తర్వాత ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి అభిమానులను నిరాశపరిచింది. మరీ ముఖ్యంగా మహీ ఆటతీరు, సారథ్యం ఉసూరుమనిపిస్తోంది. అన్నీ చూసుకొనే రైనా లేడు. సీనియర్ల ఫిట్‌నెస్‌పై సందేహాలు  నెలకొన్నాయి. ఫీల్డింగ్‌ దారుణంగా ఉంటోంది. బౌలింగ్‌లో పస కనిపించడం లేదు. ఆటగాళ్లు గాయాలపాలవుతున్నారు. అంతకుమించి ధోనీయే ఆత్మవిశ్వాసంతో లేకపోవడం కలవరపెడుతోంది.


మరొకరిపై ఆధారం!

హైదరాబాద్‌తో మ్యాచ్‌ను గమనిస్తే ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ గుర్తుకొచ్చింది. అప్పుడు న్యూజిలాండ్‌పై ఛేదనలోనూ ఇదే సీన్‌. టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది. దాంతో భారం రవీంద్ర జడేజా, ధోనీపై పడింది. దూకుడుగా ఆడే బాధ్యతను జడ్డూకు అప్పగించిన మహీ ఆఖరి ఓవర్‌ వరకు షాట్లే ఆడలేదు. కీలకమైన 49వ ఓవర్లోనూ దంచకపోవడంతో ఆఖరి ఓవర్లో రన్‌రేట్‌ పెరిగి ఒత్తిడి ఎక్కువైంది. అనూహ్యంగా రనౌటై నిరాశగా వెనుదిరిగాడు. వార్నర్‌ సేన నిర్దేశించిన 165 పరుగుల లక్ష్య ఛేదనలోనూ అదే పరిస్థితి. జడ్డూ (50; 35 బంతుల్లో 5×4, 2×6) దూకుడుగా ఆడితే ధోనీ (47*; 36 బంతుల్లో 4×4, 1×6) అజేయంగా నిలిచాడు. కానీ గెలుపునకు అవసరమైన పరుగులు చేయలేదు. ఆరో ఓవర్లో క్రీజులోకి వచ్చిన అతడు 16వ ఓవర్లో కానీ వరుస బౌండరీలు బాదడం మొదలుపెట్టలేదు. ఆఖరి 4 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉన్నప్పుడు సింగిల్‌ తీసి భారం సామ్‌ కరన్‌పై వేయడం పూర్తిగా నిరాశపరిచింది. మరొకరిపై ధోనీ ఆధారపడటాన్ని అభిమానులు చూడలేకపోతున్నారు!


మళ్లీ.. చూపిస్తాడా?

లీగు తొలి మ్యాచులో గాల్లోకి డైవ్‌చేసిన ధోనీ ‘సింగం’లా కనిపించాడని ఆకాశానికెత్తేశారు. అతడు అత్యంత చురుకుగా, దృఢంగా ఉన్నాడని భావించారు. ఛేదనలో కేదార్‌ జాదవ్‌, జడేజా, కరణ్‌ను తనకన్నా ముందు పంపిస్తే అద్భుత వ్యూహం అమలు చేశాడని ప్రశంసించారు. ఆ తర్వాత మ్యాచుల్లోనూ వారినే ముందు పంపించడం.. జట్టు ఓటమి పాలైతే గానీ మహీకి మ్యాచ్‌ సన్నద్ధత లేదని తెలియలేదు. ఏడాది కాలంగా క్రికెట్‌ ఆడకపోవడం, క్వారంటైన్‌ వల్ల సాధనకు సమయం దొరక్కపోవడంతో లయ అందుకోలేదని అతడే స్వయంగా చెప్పాడు.

హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు వారం రోజులు విరామం దొరకడంతో సాధన చేసి ధోనీ ఆత్మవిశ్వాసం పెంచుకుంటాడని అంతా భావించారు. కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ సైతం అదే అన్నాడు. గత మూడు మ్యాచుల్లోనూ ఏ మాత్రం ఆడని, పరుగులే చేయని జాదవ్‌నే మళ్లీ ముందు పంపించడంతో అతడు లయ దొరకబుచ్చుకోలేదని అర్థమైంది. ఆఖరి ఓవర్లో సింగిల్స్‌ తీయడంతో మ్యాచ్‌పై ఆశలూ పోయాయి. ఇలా అజేయంగా నిలుస్తూ మ్యాచులను గెలిపించకపోతే ఆ పరుగులకు విలువేముందన్న గంభీర్‌ మాటలే చివరికి నిజమవుతాయా అనిపిస్తోంది. ఓటమి ఎలాగూ ఓటమే. పరుగుల అంతరం తగ్గిస్తే వచ్చే లాభమేముంది? ముందుగా వచ్చి ధాటిగా ఆడుతూ ఔటైనా ఫర్వాలేదనే వ్యాఖ్యల నేపథ్యంలో తనలోని ‘ది ఫినిషర్‌’ను మహీ ఇక ముందైనా చూపిస్తాడా లేదా చూడాలి!

-ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన