‘ఈ సాలా కప్‌ నమదే’ నిజం చేస్తారా?

కథనాలు

Published : 06/11/2020 13:10 IST

‘ఈ సాలా కప్‌ నమదే’ నిజం చేస్తారా?

కోహ్లీ సేన ఎదుట కఠిన పరీక్షలు

‘‘ఇతర జట్లతో మ్యాచ్‌ల కంటే బెంగళూరుతో జరిగే పోరుకే ప్లానింగ్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. ఎందుకంటే వారు అత్యంత ప్రమాదకరం. భీకర బ్యాటింగ్‌ లైనప్‌ వారి సొంతం’’- రోహిత్ శర్మ.

‘‘బెంగళూరు బలమైన జట్టు. కోహ్లీ గొప్పగా నడిపిస్తున్నాడు. భయంకరమైన ఆటగాళ్లు వాళ్ల సొంతం’’ -  డేవిడ్‌ వార్నర్‌.

బెంగళూరు జట్టును ఉద్దేశించి ఈ ఏడాది రోహిత్‌, వార్నర్‌ చెప్పిన మాటలు ఇవి. ఇది సరిపోదా కోహ్లీసేన ఎంత పవర్‌ఫుల్ జట్టో చెప్పడానికి! ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేకపోయినా బెంగళూరుతో మ్యాచ్ అంటే ఇతర జట్ల కాస్త ప్రత్యేక శ్రద్ధ వహిస్తాయి. దానికి కారణం విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌. అయితే ఈసారి బౌలింగ్‌లో కూడా కోహ్లీ సేన పటిష్ఠమవ్వడంతో తొలిసారి కప్‌ను ముద్దాడటం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే మూడేళ్ల తర్వాత ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్‌ దశలో బెంగళూరు గత ప్రదర్శన గురించి చూద్దాం!

తొలి నాలుగు సీజన్లలో బెంగళూరు మూడు సార్లు ప్లేఆఫ్‌కు చేరింది. ఆ సమయంలో చెన్నై తర్వాత అత్యంత విజయమైన జట్టు బెంగళూరే. తొలి సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచిన ఆ జట్టు తర్వాతి సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్‌కు చేరింది. సెమీ ఫైనల్‌లో చెన్నైని ఆరు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. కానీ, ఫైనల్లో హైదరాబాద్‌ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమిపాలై కప్‌ను అందుకోలేకపోయింది. అనంతరం మూడో సీజన్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో సెమీస్‌కు చేరింది. అయితే ముంబయి చేతిలో 35 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి వైదొలిగింది. అనిల్‌ కుంబ్లే జట్టుకు సారథ్యం వహించాడు.

ముంబయిపై గెలిచి.. చెన్నై చేతిలో ఓటమి

2011‌లో బెంగళూరు జూలు విదిలించింది. గేల్ విధ్వంసంతో వరుసగా ఏడు విజయాలు సాధించింది. 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు చేరింది. అయితే క్వాలిఫయిర్‌-1 మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అనంతరం ముంబయితో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అదరగొట్టింది. 43 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. కానీ, చెన్నై చేతిలో బెంగళూరుకు మరోసారి భంగపాటు తప్పలేదు. తుది పోరులో 58 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి టైటిల్‌ను మరోసారి కోల్పోయింది. వెటోరీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు.

ఎలిమినేటర్‌లో గెలిచినా..
2012, 2013, 2014 సీజన్లలో బెంగళూరు లీగ్‌ దశను దాటలేకపోయింది. కానీ, 2015లో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు చేరింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. డివిలియర్స్‌, మన్‌దీప్‌ సింగ్‌ రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 4 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ 109 పరుగులకే కుప్పకూలింది. బెంగళూరు బౌలర్లు సమష్టిగా సత్తాచాటారు. కానీ, క్వాలిఫయర్‌-2లో బెంగళూరుకు చుక్కెదురైంది. చెన్నై చేతిలో పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన చెన్నై 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

దెబ్బకొట్టిన హైదరాబాద్‌..

2016లో బెంగళూరు గర్జించింది. కోహ్లీ భీకర ఫామ్ కొనసాగించడం‌తో ఫైనల్‌కు చేరింది. క్వాలిఫయర్‌-1లో టేబుల్ టాపర్ గుజరాత్‌ను మట్టికరిపించి టైటిల్‌పోరుకు సిద్ధమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ 158 పరుగులకే ఆలౌటవ్వగా.. బెంగళూరు ఆరు వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే ఛేదించింది. అయితే ఆఖరిమెట్టుపై బెంగళూరు మరోసారి బోల్తా పడింది. ఫైనల్లో హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన వార్నర్‌సేన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. గేల్, కోహ్లీ మెరుపు అర్ధశతకాలతో ఘనమైన ఆరంభాన్ని అందించడంతో బెంగళూరు గెలుపు దిశగా సాగింది. కానీ వారిద్దరు ఔటవ్వడంతో 200 పరుగులకు పరిమితమైంది. అనంతరం 2017, 18, 19 సీజన్లలో బెంగళూరు విఫలమైంది. కానీ ఈ సీజన్‌లో చక్కని ప్రదర్శనతో మరోసారి ప్లేఆఫ్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌తో శుక్రవారం తలపడనుంది. మరి వార్నర్‌సేనపై బెంగళూరు గెలిచి ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా? లేదా తడబడి టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. అయితే తమ ‘ఈ సాలా కప్ నమదే’ నినాదాన్ని నిజం చేయాలంటే హైదరాబాద్‌పై, క్వాలిఫయర్‌-2లో, ఫైనల్లో కోహ్లీసేన విజయం సాధించాలి. బలమైన ప్రత్యర్థులు ముంబయి, దిల్లీని అధిగమించాలి.

- ఇంటర్నెట్‌డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన