కరోనా‌ కాలంలో.. ప్రవాస భారతీయం
 కరోనా‌ కాలంలో.. ప్రవాస భారతీయం

 

 

దిల్లీ: వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయుల్లో కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడిన వారు 11 వేలకు పైమాటే అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక వారిలో కొవిడ్‌-19 వల్ల మరణించిన వారు 373 మంది అని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి  మురళీధరన్‌ పార్లమెంటుకు తెలిపారు.  ఇక వీరిలో అధికంగా అంటే 284 మంది సౌదీ అరేబియాలోనివసిస్తున్నవారే అని తెలిసింది.
విదేశాల్లో కరోనా భారతీయులు
వివిధ భారతీయ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. సెప్టెంబర్‌ 10 నాటికి కరోనా వైరస్‌ సోకిన ప్రవాస భారతీయులు 11,616 అని మంత్రి తెలిపారు. కాగా, బహ్రైన్‌లో 30 మంది అమెరికాలో 13 మంది చనిపోయారని ఆయన తెలిపారు. ఇక దేశాల వారీగా కేసుల సంఖ్యకు వస్తే సింగపూర్‌ భారతీయుల్లో 4618 మందికి కొవిడ్‌-19 సోకింది. అనంతరం బహ్రైన్‌ (2639), కువైట్‌ (1769), ఒమన్‌ (907), కతార్‌ (420), ఇరాన్ (308), యూఏఈ (238), ఇటలీ (192) మలేషియా (60) ఉన్నాయి.
కాగా విదేశాల్లోని భారతీయుల సంక్షేమం కోసం భారతీయ సంఘాలను ఏర్పాటు చేసారు. కొన్ని దేశాల్లో ఆహారం, నివాసం, అత్యవసర వైద్య సహాయాన్ని కూడా అందిస్తున్నారు. కాగా, 62,000 కు పైగా ప్రవాస భారతీయుల సహాయార్థం నెలకొల్పిన ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఫండ్‌ ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.22.5 కోట్లు ఖర్చు చేసినట్టు మురళీధరన్‌ వెల్లడించారు. గల్ఫ్‌ దేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావటంలో ఏ జాప్యం చోటుచేసుకోలేదని మరో ప్రశ్నకు సమాధానంగా  సభకు తెలిపారు.
తిరిగి వచ్చిన వారి ఉపాధి కోసం ‘స్వదేశ్‌’
వందేభారత్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 6,630 మంది విద్యార్థులు 3,08,099 ఉద్యోగులు మాతృదేశానికి తిరిగి వచ్చారని వివరించారు. కాగా దరఖాస్తు చేసుకుని, తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్న భారతీయులు 4,80,738 మంది ఉన్నారని తెలిపారు.
స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల ఉపాధి కోసం భారత ప్రభుత్వం స్వదేశ్‌ (స్కిల్‌డ్‌ వర్కర్స్‌ అరైవల్‌ డాటాబేస్‌ ఫర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సపోర్ట్‌) కార్యక్రమం చేపట్టిందన్నారు.  వారి వారి నైపుణ్యం, అనుభవం మేరకు భారతీయ, విదేశ సంస్థల నియామక అవసరాలకు అనుగుణంగా దీనిని నిర్వహిస్తోందని మంత్రి వివరించారు. అంతేకాకుండా మరింత సమర్ధవంతమైన సహాయం అందించేందుకు స్వదేశ్‌ డాటాబేస్‌ను, స్కిల్‌ ఇండియాకు చెందిన అసీమ్‌ (ఆత్మనిర్భర్‌ స్కిల్‌డ్‌ ఎంప్లాయీ ఎంప్లాయర్‌ మేపింగ్‌) కార్యక్రమానికి అనుసంధానించారు. ప్రవాస భారతీయుల సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అందచేస్తున్నామన్నారు.

Advertisement

Advertisement


మరిన్ని