కెనడాలో అనంత యువకుడి ఆత్మహత్య
కెనడాలో అనంత యువకుడి ఆత్మహత్య

అనంత నేరవార్తలు: ప్రేయసి దూరమవుతోందనే మనోవేదనతో అనంతపురానికి చెందిన ఓ యువకుడు కెనడాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుటుంబసభ్యులు, నాలుగో పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని కోవూరు నగర్‌కు చెందిన నారాయణ స్వామి కుమారుడు ప్రణయ్‌ (29) గత రెండేళ్లుగా కెనడాలో ఉంటున్నాడు. అక్కడే ఏపీకి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. గత ఆరునెలలుగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని ఇరు కుటుంబాల తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు అంగీకరించి కరోనా పరిస్థితుల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కెనడాలో వివాహ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

అయితే అక్టోబర్‌ 11 నుంచి ప్రణయ్‌, ఆ యువతి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. అనంతరం యువతి అమెరికా వెళ్లేందుకు వీసా లభించింది. అమెరికా వెళ్తున్నందున వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు యువతి చెప్పింది. అప్పటి నుంచి తనకు ప్రేయసి దూరమవుతోందని.. దీనికి తోడు మరో యువకుడితో పరిచయాలు కొనసాగిస్తోందని ప్రణయ్‌ భావించాడు. ఈ క్రమంలో మనోవేదనకు గురైన ప్రణయ్‌.. విష వాయువు పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహం శనివారం అనంతపురం చేరుకునే అవకాశమున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.


 


Advertisement

Advertisement


మరిన్ని