నేను ఆగినా.. కరోనా ఆగదుగా: బైడెన్
నేను ఆగినా.. కరోనా ఆగదుగా: బైడెన్

దిల్లీ: కరోనావైరస్ కట్టడికి ప్రస్తుత ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాల్సి ఉందని అమెరికాకు తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ హెచ్చరించారు. ఆ దేశంలో మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ రోజుకు లక్షకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం సర్వసాధారణంగా మారింది. దాంతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 

‘నేను అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాను. కానీ, వచ్చే ఏడాది వరకు నేను అధ్యక్షుడిని కాలేను. అయితే, కొవిడ్-19కి తేదీలు, క్యాలెండర్‌తో సంబంధం లేదు. వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని బైడెన్ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని విడనాడి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. 

అగ్రదేశం అమెరికాపై కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇటీవల రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడమే అందుకు నిదర్శనం. ఇప్పటికే అక్కడ కోటిమందికి పైగా వైరస్ బారిన పడగా..2,44,302 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికారాన్ని చేపట్టగానే కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి  బైడెన్ ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. 12 మంది సభ్యులతో కూడిన కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.  


మరిన్ని