అమెరికాలో భారీ పేలుడు
అమెరికాలో భారీ పేలుడు

నాష్‌‌విల్లే: అమెరికాలో భారీ పేలుడు సంభవించింది. క్రిస్మస్‌ పర్వదినం రోజు ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేకెత్తించింది. టెన్నెసీ రాష్ట్రం నాష్‌విల్లే నగరంలో ఓ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనంలో దుండగులు అమర్చిన బాంబు పేలినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో బార్లు, రెస్టారెంట్లు అధికంగా ఉంటాయని పోలీసులు తెలిపారు. కానీ, పేలుడు ఉదయం జరగడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. పేలుడు దాటికి సమీపంలోని భవనాలు, కార్లు ధ్వంసమయ్యాయి.

మానవ శరీర అవశేషాలు...

ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు అధికారికంగా పేర్కొన్నారు. కానీ, పేలుడు సంభవించిన ప్రాంతంలో మానవ శరీరానికి సంబంధించిన కొన్ని అవశేషాలు ఉన్నాయని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే, అవి ఎవరివన్నది మాత్రం ఇంకా గుర్తించలేకపోయారు. పేలుడుకు కారణమైన దుండగుడివే అయ్యుంటాయని అనుమానిస్తున్నారు. లేదా ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నవారివైనా అయ్యుండాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణకు సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

మరికాసేపట్లో బాంబు పేలబోతోంది...

పేలుడు జరగడానికి ముందు ఆ ప్రాంతంలో కాల్పులు జరుగుతున్నట్లు గుర్తు తెలియని దుండగుల నుంచి సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వాటికి స్పందిస్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఆ ప్రాంతంలో గాలింపులు చేపడుతుండగా.. అక్కడే నిలిపి ఉంచిన ఓ రిక్రియేషనల్‌ వ్యాన్‌ నుంచి బాంబు పేలుడుకు సంబంధించిన ప్రకటన వచ్చినట్లు తెలిపారు. ‘‘మరో 15 నిమిషాల్లో ఈ ప్రాంతంలో బాంబు పేలే ప్రమాదం ఉంది’’ అంటూ రికార్డ్ చేసి ఉంచిన సందేశం వినపడిందని తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దగ్గర్లోని భవనాలు, ఇళ్ల నుంచి అందరినీ ఖాళీ చేయించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రకటన వచ్చిన కాసేపటికే వ్యాన్‌ పేలినట్లు వెల్లడించారు. అయితే, పేలుడుకు ముందు అక్కడ కాల్పులు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. 

ఇవీ చదవండి..

యూఏఈలో చిక్కుకుపోయిన భారతీయులు

భారత్‌లోకి చొరబడాల్సిన అవసరం మాకు లేదు


Advertisement

Advertisement


మరిన్ని