దేవుడి ఆశీర్వాదం వల్లే నాకు కరోనా: ట్రంప్‌
దేవుడి ఆశీర్వాదం వల్లే నాకు కరోనా: ట్రంప్‌

వాషింగ్టన్‌: ‘దేవుడి ఆశీర్వాదం వల్లే నాకు కరోనా వచ్చింది అనుకుంటున్నా. వైరస్‌ రావడం వల్లే ప్రజలకు ఉచితంగా అందించాలనుకున్న చికిత్స గురించి ముందుగా నేనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నా’ అని అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. కొవిడ్‌ సోకడంతో సైనిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ట్రంప్‌.. రెండు రోజుల క్రితం శ్వేతసౌధానికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. నేడు ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 

కొవిడ్‌ సోకిన తర్వాత మిలిటరీ ఆసుపత్రిలో చేరానని, అక్కడ అత్యుత్తమ చికిత్సను పొందానని ట్రంప్‌ వీడియోలో పేర్కొన్నారు. తనకు కరోనా సోకడం దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల తనకు చాలా విషయాలు తెలిశాయన్నారు. కరోనాకు వైద్యులు అందిస్తున్న చికిత్స ఎంత ఉత్తమమైనదో స్వయంగా తెలుసుకోగలిగానని చెప్పారు. ఓ అధ్యక్షుడిగా కొవిడ్‌కు తాను ఎలాంటి చికిత్స అయితే తీసుకున్నానో.. అదే చికిత్సను అమెరికా ప్రజలకు ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. 

చైనాకు భారీ మూల్యం తప్పదు..

ఈ సందర్భంగా చైనాపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కారణమైన ఆ దేశం భారీ మూల్యం చెల్లించక తప్పదని వ్యాఖ్యానించారు. ‘ఇక్కడ(అమెరికా) ఏదైతే జరిగిందో దానికి తప్పు మీది(తన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ) కాదు. ఇది చైనా తప్పిదం. మనకు, యావత్‌ ప్రపంచానికి చైనా చేసిన దానికి త్వరలోనే భారీ మూల్యం చెల్లిస్తుంది. గుర్తుపెట్టుకోండి.. ఇది చైనా చేసిన తప్పు’ అని ట్రంప్‌ వీడియోలో అన్నారు. ఇటీవల చైనాపై ట్రంప్‌ సర్కార్‌ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.  మరిన్ని