కరోనాపై పోరు: 5 నెలలకు పైగా యాంటీబాడీలు!
కరోనాపై పోరు: 5 నెలలకు పైగా యాంటీబాడీలు!

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సోకినప్పుడు విడుదలయ్యే యాంటీబాడీస్‌ అనే ప్రత్యేక ప్రొటీన్లు.. ఐదు నుంచి ఏడు నెలల అనంతరం కూడా ఆ వ్యాధి సోకకుండా కాపాడతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారతీయ మూలాలున్న దీప్తా భట్టాచార్య నేతృత్వంలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనా శాస్త్రవేత్తలు.. సుమారు 6000 కొవిడ్‌-19 బాధితుల నుంచి సేకరించిన నమూనాలపై ఈ పరిశోధనలు జరిపారు. వీటి ఫలితాలు ఇమ్యూనిటీ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మానవ శరీర కణాలపై కొవిడ్‌ వైరస్‌ దాడిచేసినపుడు వ్యాధినిరోధక వ్యవస్థ తొలుత తక్కువ జీవిత కాలం గల ప్లాస్మా కణాలతో ఎదిరిస్తుంది. ఈ క్రమంలో యాంటీబాడీస్‌ అనే రక్షక ప్రొటీన్లు విడుదలౌతాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకిన 14 రోజుల్లో వీటి ఉనికిని రక్త పరీక్ష ద్వారా కనిపెట్టొచ్చు. అయితే, వ్యాధి రెండో దశలో అధిక కాలం నిలిచి పోరాడే ప్లాస్మా కణాలు విడుదలౌతాయని పరిశోధనలో తేలింది. ఈ ప్రక్రియలో శరీరంలో సుదీర్ఘ కాలం ఉండే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, ఇవే కొవిడ్‌ నుంచి రక్షణ కల్పిస్తాయని దీప్తా భట్టాచార్య వివరించారు. ఈ యాంటీబాడీలు కొవిడ్‌ సోకిన ఐదు నుంచి ఏడు నెలల అనంతరం కూడా విడుదల కావడం తాము గమనించామని తెలిపారు. 

ఇప్పటి వరకు మొదటి తరహా కరోనా యాంటీబాడీస్‌ను పరిగణనలోకి తీసుకోవడంతో కరోనా వ్యాధి నిరోధకత ఎక్కువ కాలం నిలవవని శాస్త్రజ్ఞులు భావిస్తూ వచ్చారు. మనుషుల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ కొవిడ్‌ను మరింత ఎక్కువ కాలం, సమర్థంగా ఎదుర్కొంటుందని తమ ప్రయోగాల వల్ల రుజువైనట్టు ఈ పరిశోధనలో రుజువైంది. తమ ప్రయోగ ఫలితాలు కరోనా వైరస్‌ యాంటీబాడీ పరీక్షలు మరింత సమర్ధంగా నిర్వహించేందుకు అవకాశం కలిగిస్తాయని పరిశోధకులు వెల్లడించారు.

Advertisement

Advertisement


మరిన్ని