కెనడాలో రెండో దఫా విజృంభణ!
కెనడాలో రెండో దఫా విజృంభణ!

ఒట్టావా: కరోనా మహమ్మారి విజృంభణతో ఇప్పటికే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. కొన్ని దేశాల్లో ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి వస్తుండగా, మరికొన్ని దేశాల్లో మాత్రం రెండో దఫా విస్తరిస్తోంది. తాజాగా కెనడాలోనూ రెండో దఫా విజృంభణ ప్రారంభమైనట్లు ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో వెల్లడించారు. ఈ సమయంలో కెనడియన్లు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కొన్నిరోజుల క్రితం వరకు కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. గతవారం నుంచి దేశవ్యాప్తంగా వైరస్‌ విజృంభణ మొదలైంది. నిత్యం వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలా చోట్ల రెండో దఫా వైరస్‌ విజృంభణ మొదలైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రధానమంత్రి నేరుగా ప్రసార మాధ్యమాల ద్వారా కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా కెనడాలోని నాలుగు అతిపెద్ద ప్రావిన్సుల్లో వైరస్‌ తీవ్రత పెరగడంతో ట్రూడో ప్రజలను అప్రమత్తం చేశారు. గతంతో పోలిస్తే వైరస్‌ విజృంభణ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు.

అంతేకాకుండా, వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తేనే వైరస్‌ను నియంత్రించవచ్చని ప్రజారోగ్య విభాగాధిపతి థెరిస్సా టామ్‌ స్పష్టం చేశారు. ఇక, ప్రధాని ట్రూడో భార్య గ్రెగొరీ ఇదివరకే కరోనా వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రూడో కొన్ని రోజులపాటు ఇంటినుంచే విధులు నిర్వర్తించారు. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు కెనడాలో దాదాపు లక్షా 50వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 9200 మంది ప్రాణాలు కోల్పోయారు.


మరిన్ని