ప్రజాస్వామ్యం గందరగోళంగా ఉంటుంది: బైడెన్‌
ప్రజాస్వామ్యం గందరగోళంగా ఉంటుంది: బైడెన్‌

ఓపిక అవసరమన్న బైడెన్

వాషింగ్టన్‌: ప్రజాస్వామ్యం కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుందని.. ఓపిక పట్టాల్సిన అవసరం ఉంటుందని డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తేలడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఓటు లెక్కించే వరకు అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన అధ్యక్ష పీఠం చేజిక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 270కి కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన ప్రత్యర్థి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు సాధించారు. 

‘‘అమెరికాలో ఓటు చాలా పవిత్రమైంది. దీని ద్వారా ప్రజలు తమ అభీష్టాన్ని వ్యక్తపరుస్తారు. కేవలం ప్రజల తీర్పు మాత్రమే అధ్యక్షుణ్ని నిర్ణయిస్తుంది. మరే శక్తీ కాదు. కావున ప్రతి ఓటును లెక్కించాలి. ప్రస్తుతం అదే జరుగుతోంది. అలాగే జరగాలి కూడా. ప్రజాస్వామ్యం కొన్నిసార్లు గందరగోళంగా ఉంటుంది. ఓపిక అవసరం. ప్రపంచమంతా అసూయపడేలా ఉన్న 240 ఏళ్ల పాలనా వ్యవస్థకు ఇప్పుడు ప్రతిఫలం లభిస్తోంది’’ - బైడెన్, డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి

కౌంటింగ్‌ పూర్తయ్యే సరికి తామే విజయం సాధిస్తామని ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో కలిసి బైడెన్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే లెక్కింపు పూర్తవుతుందని.. అప్పటి వరకు సంయమనంతో ఉండాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి..

జార్జియాలో తగ్గిన ట్రంప్‌ ఆధిక్యం..!

లీగల్‌ ఓట్లు లెక్కిస్తే విజయం నాదే: ట్రంప్‌

Advertisement


మరిన్ని