వందేభారత్‌ విమానాలు తాత్కాలికంగా నిలిపివేత
వందేభారత్‌ విమానాలు తాత్కాలికంగా నిలిపివేత

దిల్లీ: కొత్త రకం కరోనా వైరస్‌ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ నుంచి వచ్చే వందేభారత్‌ విమానాలను తాత్కాలికంగా నిలిపివేశామని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. వర్చువల్‌గా జరిగిన విలేకరుల సమావేశంలో విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాత్సవ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎనిమిదో దశ వందేభారత్‌ మిషన్‌లో భాగంగా వెయ్యికి పైగా అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ 40లక్షల మంది స్వదేశానికి చేరుకున్నారని తెలిపారు.

తాజాగా కరోనా వైరస్  కొత్త‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశాలకు సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ను ఈ ఏడాది మేలో ప్రారంభించింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌లు తయారు చేస్తున్న నేపథ్యంలో డిసెంబరు 20న యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కొత్త రకం కరోనాను గుర్తించామని చెప్పడం కలకలం సృష్టించింది. దీంతో ప్రపంచం మొత్తం అప్రమత్తమైంది. కొత్త రకం కరోనాను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలను ప్రారంభించింది.

ఇవీ చదవండి..

యూకే, దక్షిణాఫ్రికా.. ఇప్పుడు నైజీరియా


మరిన్ని