కమలకు అవమానం, భారతీయ అమెరికన్ల ఉద్యమం
కమలకు అవమానం, భారతీయ అమెరికన్ల ఉద్యమం

ఆన్‌లైన్‌లో వెల్లువెత్తుతున్న మద్దతు

వాషింగ్టన్‌: జార్జియా రాష్ట్రంలోని మెకాన్‌ నగరంలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో.. డెమొక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ పేరును.. రిపబ్లిక్‌ పార్టీ సెనేటర్ డేవిడ్‌ పెర్‌డ్యూ తప్పుగా సంబోధించిన సంగతి తెలిసిందే. ‘‘కాహ్‌-మా-లా? కాహ్‌-మాహ్‌-లా? కమలా-మలా- మాలా? ఏదో నాకు తెలియదు.. ఏదైనా కానీయండి..’’ అంటూ వేలాది మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో ఆయన అనటం చర్చనీయాంశమైంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ విధమైన ప్రవర్తనను కమల మద్దతుదారులే కాకుండా పలువురు భారతీయ అమెరికన్లు ఖండిచారు.

గౌరవనీయులైన ఓ తోటి సెనేటర్‌ పేరును డేవిడ్‌ ఈ విధంగా అవమానకరంగా సంబోధించటం సరికాదని పలువురు మండిపడుతున్నారు. ఈ వైఖరికి నిరసనగా సామాజిక మాధ్యమాల్లో ‘‘#MyNameIs’’ అనే హ్యాష్‌ టాగ్‌తో ఓ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా హారిస్‌కు మద్దతు ప్రకటిస్తూ ప్రతి ఒక్కరు తమ పేరును, దాని అర్థాన్ని తమ ట్విటర్‌ ఖాతాలో వివరిస్తున్నారు. కమల సమీప బంధువు మీనా హారిస్‌, న్యూయార్క్‌ మాజీ అటార్నీ జనరల్‌ ప్రీత్‌ భరారా, శాసన సభ్యుడు రో ఖన్నాతో సహా పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు దీనిలో పాల్గొన్నారు. తాము అమెరికా పౌరులైనందుకు, ఇతరుల పేర్లను స్పష్టంగా పలకగలిగినందుకు తాము గర్విస్తున్నామంటూ డేవిడ్‌ పెర్‌డ్యూ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

మరో వైపు డేవిడ్‌ పెర్‌డ్యూ హ్యారిస్‌ పేరును సరిగా ఉచ్ఛరించలేకపోయారని.. అంతే తప్ప ఆయనకు అవమానించే ఉద్దేశమేదీ లేదని ఆయన ప్రతినిధి వివరణ ఇచ్చారు. అయితే ఆయన ఉద్దేశ పూర్వకంగానే అలా అన్నారనేది స్పష్టంగా తెలుస్తోందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.


Advertisement


మరిన్ని