రవి సోలంకి: ఈ యువకుడే బ్రిటన్‌లో కరోనా హీరో
రవి సోలంకి: ఈ యువకుడే బ్రిటన్‌లో కరోనా హీరో

కొవిడ్‌ కాలంలో ఆవిష్కరణకు దక్కిన అత్యున్నత గౌరవం

లండన్‌: బీద, ధనిక  తేడా లేకుండా కరోనా వైరస్‌ అందరినీ పీడిస్తోంది. అభివృద్ధి చెందిన, వెనుకబడిన అనే తేడా లేకుండా ప్రపంచమంతా ఈ వ్యాధి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు సహకరించిన ఓ వ్యక్తి బ్రిటన్‌లో హీరోగా నిలిచారు. రవి సోలంకి అనే భారతీయ మూలాలున్న ఈ యువవైద్యుడిని బ్రిటన్‌లోని రాయల్‌ ఆకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌.. అత్యున్నత ‘ప్రెసిడెంట్‌ స్పెషల్‌ అవార్డు’తో సత్కరించింది. రవి సోలంకి వంటి వారు తమ దేశంలో ఉండటం తమకు గర్వకారణమని రాయల్‌ ఆకాడమీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సర్‌ జిమ్‌ మెక్‌ డొనాల్డ్‌ ప్రశంసించారు.

‘హీరోస్‌’ను రూపొందించిన హీరో

రవి సోలంకి వృత్తి రీత్యా న్యూరోడీజనరేటివ్ (‌నాడీవ్యవస్థ సంబంధిత సమస్యల) వైద్యులు. రేమండ్‌ సియామ్స్‌ అనే మరో శాస్త్రవేత్తతో కలసి కరోనా సహాయక వెబ్‌సైట్‌ ‘HEROES (హీరోస్)‌’ రూపొందించినందుకు గాను ఆయన ఈ గౌరవాన్ని పొందారు. కొవిడ్-19 అత్యవసర పరిస్థితిలో స్వచ్ఛందంగా స్పందించి.. ఈ అద్భుత ఆవిష్కరణతో దేశానికే మేలు చేసినందుకు బ్రిటన్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఈయనకు కృతజ్ఞతలు తెలియచేసింది. కాగా, దీనిని రవి కేవలం రెండు రోజుల్లోనే సాకారం చేయటం విశేషం.

3 నెలల్లో 90,000 మందికి ప్రయోజనం

ఈ వెబ్‌సైట్‌ కొవిడ్‌-19 సమాచారం, అత్యవసర సహాయం అందించటమే కాకుండా.. సహాయాన్ని అభ్యర్థించేందుకు వైద్య సిబ్బందికి కూడా వీలు కలిగిస్తుంది. దీనిద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన సిబ్బందికి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ విధంగా మూడు నెలల్లో 90,000 మంది వైద్య సిబ్బందికి ప్రయోజనం కలిగిందని అకాడమీ ప్రతినిధులు వెల్లడించారు. కరోనా కట్టడి కోసం ముందువరసలో నిలిచి శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి, తద్వారా దేశానికి రవి ఎంతో మేలు చేసినట్టు అకాడమీ ప్రతినిధులు తెలియజేశారు.


మరిన్ని