రష్యా వ్యాక్సిన్‌పైనే భారతీయుల గురి
రష్యా వ్యాక్సిన్‌పైనే భారతీయుల గురి

స్పుత్నిక్‌-వి టీకాపై నమ్మకం కనబర్చారన్న ఆర్డీఐఎఫ్‌

దిల్లీ: దేశంలో కేసుల సంఖ్య 90 లక్షలకు చేరువౌతున్న నేపథ్యంలో భారతీయుల్లో 80 శాతం మంది కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కావాలనుకుంటున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. కొవిడ్‌-19 టీకా విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఎంపికను గురించిన ఈ సర్వే ప్రపంచ వ్యాప్తంగా 11 దేశాల్లో, 12 వేల మందిపై నిర్వహించారు. దాని ఫలితాలను రష్యన్‌ డైరక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్డీఐఎఫ్‌) వెల్లడించింది. వీరిలో 73 శాతం మంది కరోనా వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఇక రష్యా వ్యాక్సిన్‌ను గురించి తెలిసిన ప్రతి ఐదుగురిలో నలుగురు తమకు అదే కావాలని స్పష్టం చేశారని సంస్థ పేర్కొంది. ఇది ఇతర వ్యాక్సిన్ల కంటే తొమ్మిది రెట్లు ఎక్కువని వెల్లడించింది.

30 శాతం జనాభా ఉన్న 10 దేశాల్లో

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ యూగవ్‌ అక్టోబర్‌ 9 నుంచి 19 మధ్యలో ఈ సర్వే నిర్వహించింది. దీనిలో భారత్‌తో సహా బ్రెజిల్‌, వియత్నాం, ఈజిప్ట్‌, ఇండోనేషియా, మలేషియా, మెక్సికో, నైజీరియా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫిలిప్పైన్స్‌ దేశాల ప్రజలు పాల్గొన్నారు. వైవిధ్యభరితమైన పరిస్థితులు నెలకొన్న ఈ దేశాలు..  ప్రపంచ జనాభాలో 30 శాతాన్ని కలిగి ఉన్నాయని సంస్థ వెల్లడించింది. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ 92 శాతం మేరకు రక్షణ కల్పిస్తున్నట్టుగా వెల్లడి కాకముందే ఈ సర్వే నిర్వహించామని,  ప్రస్తుతం ఈ ఫలితాలు మరింత మెరుగ్గా ఉండవచ్చని సంస్థ అభిప్రాయపడింది.

సర్వేలో పాల్గొన్న 12 వేల మందిలో 60 శాతం రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి గురించి అవగాహన ఉన్నట్టు తెలిపారు. సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది రష్యా వ్యాక్సిన్‌ వైపే మొగ్గు చూపారని, భారత్‌లో ఇతర వ్యాక్సిన్ల కంటే తమ వ్యాక్సిన్‌పైనే గురి ఉందని ఆర్డీఐఎఫ్‌ ప్రకటించింది. స్పుత్నిక్‌-విని ప్రపంచ వ్యాప్తంగా నమ్మదగిన వ్యాక్సిన్‌గా పరిగణిస్తున్నట్టు కూడా సర్వేలో స్పష్టమైందని సంస్థ తెలిపింది.

రష్యా తయారుచేసిన కొవిడ్-19 వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఉత్పత్తి భారత్‌, చైనాల్లో జరగనుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెలువడ్డ సర్వే ఫలితాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

Advertisement

Advertisement


మరిన్ని