బాలుడి పెయింటింగ్‌.. పరవశించిన హారిస్‌
బాలుడి పెయింటింగ్‌.. పరవశించిన హారిస్‌

 

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌  ఫోన్‌ కాల్‌తో ఓ 14 ఏళ్ల బాలుడు ఆనందంలో తడిసి ముద్దయ్యాడు. పెయింటర్‌ అయిన ఆ బాలుడికి ఫోన్‌ చేసి హారిస్‌ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని బే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల టేలర్‌ గోర్డన్‌ తన ప్రతిభతో కాన్వాస్‌ బోర్డుపై కమలా హారిస్‌ చిత్రాన్ని గీశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ ‘కమలా హారిస్‌ గారూ నా పేరు టేలర్‌ గోర్డన్‌. నాకు 14 ఏళ్లు. నేను మీ చిత్రాన్ని గీశాను. మీకు ఇది నచ్చుతుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశాడు. ఆమెకు చేరేలా ఆ ట్వీట్‌ను రీట్వీట్‌, ట్యాగ్‌, షేర్‌ చేయాలని నెటిజన్లను కోరాడు.

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కుమార్తె, రచయిత్రి చల్సియా క్లింటన్‌తోపాటు అనేకమంది ఆ ట్వీట్‌ను షేర్‌ చేశారు. దీంతో అది కాస్త కమలా హారిస్‌ వద్దకు చేరింది. ఆనందం వ్యక్తం చేసిన ఆమె... ఆ బాలుడికి ఫోన్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశారు. ‘టేలర్‌ అద్భుతమైన పనితనం చూపించావు. నువ్వు గీసిన చిత్రాన్ని చూసి పరవశించిపోయాను. నాకు అది ఎంతో అపురూపమైన బహుమతి. త్వరలోనే నిన్ను కలుస్తా. నీ ప్రతిభకు ఓ బహుమతి అందిస్తా’ అని ఆ బాలుడితో అన్నారు. హారిస్‌ ఫోన్‌తో ఉబ్బితబ్బిబ్బయిన బాలుడు సైతం ఆమెకు ధన్యవాదాలు తెలిపాడు. ఆమెను కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు. తన వీడియో హారిస్‌ వరకూ చేరేలా చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ బాలుడు పెట్టిన పోస్టు, వారి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.
 

మరిన్ని