‘భావాలను యథాతథంగా మాతృభాషలోనే చెప్పగలం’
‘భావాలను యథాతథంగా మాతృభాషలోనే చెప్పగలం’

అమెరికాలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి కోమటి జయరాం

ఇంటర్నెట్‌డెస్క్‌: తేనెలొలుకు తెలుగుని మనకు మరింత దగ్గర చేసిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి అని అమెరికాలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. సంస్కృతంతో మిళితమై గ్రాంథికంగా ఉండిపోయిన తెలుగును మదించి వ్యావహారిక భాషలోకి సరళీకరించారని చెప్పారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా జరుపుకొంటున్న తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోమటి జయరాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘మన మాతృభాష 56 అక్షరాల తెలుగు కావడం మన అదృష్టం. మనం ఎన్ని భాషలు నేర్చినా.. భావాలను యథాతథంగా కేవలం మాతృభాషలోనే చెప్పగలం. అందుకే మన పిల్లలకు మాతృభాషను నేర్పుదాం.. నేర్చుకునేలా ప్రోత్సహిద్దాం. మనం ఏ దేశానికి వెళ్లినా తెలుగును మరువకూడదు.
 నేటివ్ స్పీకర్స్ పరంగా ప్రపంచ భాషల్లో తెలుగుది 11వ స్థానం. భారత్‌లోని 6 క్లాసికల్ లాంగ్వేజెస్‌లో తెలుగు ఒకటి. దేశంలో నాలుగో అతిపెద్ద భాష కూడా మనదే. అమెరికాలో వేగంగా పెరుగుతున్న భాషగా తెలుగు విస్తరిస్తోంది. 
తెలుగులో రాయడం, చదవడం, మాట్లాడడం నేర్చుకొని తెలుగుదనాన్ని ముందుకు తీసుకెళదాం. తెలుగు భాషాసంపదను భవిష్యత్‌ తరాలకు అందజేద్దాం’’ అని కోమటి జయరాం పిలుపునిచ్చారు.

తెలుగు భాషా దినోత్సవం రోజు గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగు తల్లి విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయకపోవడంపై కోమటి జయరాం విచారం వ్యక్తం చేశారు.  తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు తల్లిని తెలుగు వారే అవమానించుకుంటే ఎలా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఏనాడూ ఇలా జరగలేదన్నారు.

 


మరిన్ని