ట్రంప్‌ త్వరగా కోలుకోవాలి..మోదీ!
ట్రంప్‌ త్వరగా కోలుకోవాలి..మోదీ!

దిల్లీ: కరోనా వైరస్‌ బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ త్వరగా కోలుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. తన మిత్రుడు డొనాల్డ్‌ ట్రంప్‌తోపాటు ఆయన సతీమణి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు. తనతోపాటు అమెరికా ప్రథమ మహిళ మెలానియా‌కు కూడా వైరస్‌ నిర్ధారణ అయినట్లు అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్‌ త్వరగా కోలుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రంప్‌ శ్రేయోభిలాషులు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తున్నారు.

ట్రంప్‌ సలహాదారుల్లో ఒకరైన హోప్‌ హిక్స్‌కు తొలుత వైరస్‌ నిర్ధారణ అయ్యింది. అనంతరం చేసిన వైద్య పరీక్షల్లో డొనాల్డ్‌ ట్రంప్‌తోపాటు మెలానియాకు వైరస్‌ సోకినట్లు తేలింది. అయితే ప్రస్తుతం తాము ఆరోగ్యంగానే ఉన్నామని, కొన్నిరోజులపాటు తన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసుకున్నట్లు మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. చాలా మంది అమెరికన్లలాగానే తనతోపాటు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. మీరందరూ జాగ్రత్తగా ఉండాలని, మనమందరం కలిసి దీన్ని ఎదుర్కోగలమని మెలానియా ట్రంప్‌ ధీమా వ్యక్తంచేశారు. 

Advertisement

Advertisement


మరిన్ని