ఆధునికతకు అడుగుజాడ గురజాడ
ఆధునికతకు అడుగుజాడ గురజాడ

ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో సాహిత్య సదస్సు

డాలస్‌‌: ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 158వ నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు డాలస్‌లో ఉత్సాహంగా జరిగింది. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని “ఆధునికతకు అడుగుజాడ - గురజాడ” అనే అంశంపై ప్రసంగించారు. ఈ మాసపు నెలనెలా తెలుగు వెన్నెల నవయుగ కవి, వైతాళికుడు గురజాడ అప్పారావు స్మరణతో కొనసాగింది. గురజాడ జయంతి ఈ నెలలోనే ఉండటంతో వక్తలకు ఆ మహాకవి ఆశయాల మరోసారి చర్చించడం ఉత్సాహం కలిగించిందని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.  కార్యక్రమం ప్రారంభంలో చిన్నారులు సాహితీ, సింధూర ‘శివుడు తాండవం సేయునమ్మా’ అంటూ పరమేశుడిపై భక్తిగీతం ఆలపించారు. ఎప్పుడూ ఆఖరున ఉండే ప్రధాన వక్త ప్రసంగం ఈసారి మొదట్లోనే ఉండటం ఒక విశేషమైతే.. అద్భుతమైన పాండిత్యంతో కూడిన ప్రసంగాన్ని ప్రొఫెసర్‌ మేడిపల్లి రవికుమార్‌ ధాటిగా అందించడం ఈ కార్యక్రమంలో మరో విశేషం. “ఆధునికతకు అడుగుజాడ - గురజాడ” అనే అంశంపై చర్చిస్తూ గురజాడ వైతాళికుడే కాకుండా ముందుచూపు కలిగిన గొప్ప తాత్వికుడని రవికుమార్‌ తెలిపారు. సమ కాలీన సమాజంలో పీడనకు గురైన స్త్రీ జాతిని తొలుత జాగృతం చేసిన యోధుడు గురజాడేనన్నారు. 

ఎప్పటిలాగే “మన తెలుగు సిరి సంపదలు” శీర్షికన జాతీయాలు,  పొడుపు కథల పరంపరను ఉరుమిండి నరసింహా రెడ్డి కొనసాగించారు. వాటికి తోడుగా తెలుగు సాహితీ జగత్తులోని ప్రసిద్ధ కవితా పంక్తులను, కొన్ని ప్రహేళికలను ప్రశ్నలు- జవాబుల రూపంలో సదస్సులో పాల్గొన్న వారందరినీ భాగస్వాములు చేశారు. ఉపద్రష్ట సత్యం పద్య సౌగంధం శీర్షికన మల్లికార్జున భట్టు విరచిత భాస్కర రామాయణంలోని చక్కని శార్దూల పద్యాన్ని అర్థతాత్పర్య సహిత విశేషాలతో వివరించారు. “మాసానికో మహనీయుడు” అనే శీర్షిక కొనసాగింపుగా జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సెప్టెంబరు మాసంలో జన్మించిన  తెలుగు సాహితీమూర్తులను ప్రజెంటేషన్ ద్వారా సభకు గుర్తుచేశారు. గురజాడ, జాషువా లాంటి ఎందరో మహనీయులు ఈ మాసంలోనే జన్మించారని తెలిపారు. చివరి రెండు అంశాలుగా లెనిన్ బాబు వేముల, మద్దుకూరి చంద్రహాస్ గురజాడను,  ప్రారంభ దశలో వారు రాసిన రచనలనూ, ఆంగ్ల సాహిత్యంపైనా ఆయన ప్రవేశంపై వివరించి గురజాడకు నివాళులర్పించారు. 

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్, ప్రార్థనా గీతం ఆలపించిన సాహితీ, సింధూర, మిగతా వక్తలు, విచ్చేసిన సాహిత్యాభిమానులందరికీ ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహిత్య ప్రియులు మాధవి రాణి , శశికళ పట్టిసీమ, విష్ణు ప్రియ, మాధవి ముగ్ధ , శ్రీనివాస్ బసాబత్తిన , ప్రసాద్ తోటకూర, సురేష్ కాజా, చంద్రహాస్, ఆచార్యులు జగదీశ్వరన్ పూదూరు, ఉత్తరాధ్యక్షురాలు లక్ష్మి పాలేటి,  పూర్వాధ్యక్షుడు చినసత్యం వీర్నపు,  సునీల్ కుమార్, తవ్వా వెంకటయ్య, సుబ్బరాయుడు, బసవ రాజప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని