మహిళా నేతలను అవమానించేలా 2లక్షల ట్వీట్లు
మహిళా నేతలను అవమానించేలా 2లక్షల ట్వీట్లు

వెల్లింగ్టన్‌: భారీ విజయంతో జెసిండా ఆర్డెన్‌ రెండోసారి న్యూజిలాండ్ ప్రధాని పీఠాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమెతో సహా ఎన్నికల్లో పోటీచేసిన మహిళా అభ్యర్థులపై అభ్యంతరకర రీతిలో రెండు లక్షల ట్వీట్లు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి అవమానకరమైన ట్వీట్లను గుర్తించి, పోరాటం చేసే ప్యారిటీ బాట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా  2లక్షల ట్వీట్లను గుర్తించినట్లు న్యూజిలాండ్‌కు చెందిన మీడియా సంస్థ వెల్లడించింది. అవి ముఖ్యంగా ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు, ఎంపీ చ్లోఈ స్వర్బిక్‌ను లక్ష్యం చేసుకొని ఉన్నట్లు తెలిపింది. అభ్యర్థులకు వచ్చిన ట్వీట్లను ఫిల్టర్‌ చేసి ఈ సందేశాలను గుర్తించినట్లు జాక్వెలిన్‌ కోమర్‌ వెల్లడించారు. ఈ విధంగా గుర్తించే సాంకేతికతను న్యూజిలాండ్‌కు పరిచయం చేసింది ఆమెనే.  బాట్ ముఖ్యంగా మహిళా అభ్యర్థులపైనే దృష్టి సారిస్తుందని,  సోషల్ మీడియాలో వారు ఎదుర్కొనే అవమానంపై అవగాహన కల్పిస్తున్నామని కోమర్ వెల్లడించారు. మహిళలు తరచూ భయంకరమైన సందేశాలు అందుకుంటుంటారని, ఫిల్టర్ల సాయంతో వాటిని గుర్తించవచ్చని ఆమె తెలిపారు. అయితే, పురుష అభ్యర్థులకు సంబంధించి అలాంటి సమాచారం తమ వద్ద లేదని తెలిపారు.

కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీకి చెందిన జెసిండా ఆర్డెన్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 87 శాతం ఓట్లు నమోదు కాగా..లేబర్ పార్టీ 48.9 శాతం ఓట్లు సాధించింది. పార్లమెంట్‌లో 120 సీట్లకుగానూ 64 సీట్లు సొంతం చేసుకున్నారు. అయితే, ఈ ఎన్నికలకు సంబంధించి అధికారిక ఫలితాలు నవంబర్ ఆరున వెలువడనున్నాయి. 

Advertisement


మరిన్ని