బాలు పేరు ప్రతి ఇంటా వినిపిస్తుంది
బాలు పేరు ప్రతి ఇంటా వినిపిస్తుంది

డల్లాస్‌‌: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ సంతాపం వ్యక్తం చేశారు. బాలు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. 2012లో తమ ఇంట్లో జరిగిన విందుకు ఎస్పీ బాలు హాజరైన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. 2013లో డల్లాస్‌లో తానా సభలో తొలిసారి ‘పాడుతా తీయగా’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తోటకూర ప్రసాద్‌ వెల్లడించారు. బాలు లేని లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు.  

తెలుగంటే అపార గౌరవంతో, పాటలంటే ప్రాణంగా, మంచి భాషా సౌందర్యంతో వేలాది పాటలను తన అమృత గానంతో ఆలపించి ప్రతి ఒక్కరి మనసునూ దోచుకున్నారని కొనియాడారు. బాలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినా.. ఆయన మనకందించిన వేలాది పాటలతో మన అందరి హృదయాల్లో చిరంజీవి అని అన్నారు. తెలుగు పాట, సంగీతం ఉన్నంత వరకు ఆయన పేరు ప్రతి ఇంటా వినబడుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. 


మరిన్ని