ఓటమిని అంగీకరించేందుకు సిద్ధం..! ట్రంప్‌
ఓటమిని అంగీకరించేందుకు సిద్ధం..! ట్రంప్‌

ఫలితం కచ్చితమైనది ఐతేనే..!

వాషింగ్టన్‌: అధ్యక్ష ఎన్నికల ఫలితం ఏదైనా తాను అంగీకరించేందుకు సిద్ధమయ్యానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించాఉ. అయితే, ఆ ఫలితాలు కచ్చితమైనవి అయితేనే వాటిని అంగీకరిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటోన్న ట్రంప్‌, తన నిరాధార ఆరోపణలను మాత్రం మరోసారి కొనసాగించారు.

‘ఒకవేళ ఎన్నికల్లో నేను ఓడిపోయినా నేనేమీ బాధపడను. కానీ, న్యాయమైన పద్ధతిలో ఈ ఓటమి ఉండాలని కోరుకుంటున్నాను’ అని హాలీడే పార్టీ సందర్భంగా తన మద్దతుదారులతో డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘ఫలితం ఏదైనా.. దాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. జో బైడెన్‌ కూడా అలాగే ఉంటారని ఆశిస్తున్నాను. కానీ, ఎన్నికల్లో అవకతవకలపై మనదగ్గర కచ్చితమైన రుజువులున్నాయి. మనకు అవసరమైన మెజారిటీని అందించే వేలకొద్ది బ్యాలెట్‌లు మనకే చెందనున్నాయి. అయితే, పోలింగ్‌ సమయం ముగిసిన నాటికి వచ్చిన బ్యాలెట్లనే లెక్కించాలి. కానీ, అలా జరుగలేదు. అందుకే బ్యాలెట్‌ ఓట్లపై మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగతం కోసం కాదు. రాబోయే రోజుల్లో అధ్యక్షుడిని ఎన్నుకునే విధానంలో ఇవి ఎంతో కీలకంగా ఉంటాయి’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో న్యాయసమీక్ష ద్వారా అమెరికా ఎన్నికలపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకు ప్రయత్నం చేయాలని డొనాల్డ్‌ ట్రంప్ సూచించారు.

నా హయాంలో పన్నుల తగ్గింపు, నియంత్రణలు తగ్గించడం, మిలటరీని పునర్నిర్మించడం, అంతరిక్ష యానం వంటి విషయాల్లో జరిగిన పురోగభివృద్ధిపై ఎంతో మంది నన్ను అభినందించారని ట్రంప్‌ తన మద్దతుదారులతో అన్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన మోసాలను మనం బయటపెట్టకపోతే, రానున్నరోజుల్లో మనదేశం ఇప్పుడున్న మాదిరిగా కనిపించదని ఆయన‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఇదిలాఉంటే, నవంబర్‌ 3వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌కు పూర్తి మెజారిటీ వచ్చినప్పటికీ ట్రంప్‌ మాత్రం ఆ ఓటమిని అంగీకరించలేదు. వీటిపై న్యాయపోరాటానికి సిద్ధమైన ట్రంప్‌నకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ నేపథ్యంలో ఓటమిని అంగీకరించేందుకు ట్రంప్‌ సిద్ధమైనట్లు ఆయన మాటల్లో అర్థమవుతోంది. డిసెంబర్‌ 14వ తేదీన అమెరికా అధ్యక్షుడిని యూఎస్‌ ఎలక్టోరల్‌ కాలేజ్‌ అధికారికంగా ప్రకటించనుంది.

ఇవీ చదవండి..
బైడెన్‌ తొలిరోజు నిర్ణయం అదేనా..?
బైడెన్‌కు గాయం..స్పందించిన ట్రంప్‌

Advertisement

Advertisement


మరిన్ని