న్యూజిలాండ్‌ మంత్రిగా భారత సంతతి మహిళ
న్యూజిలాండ్‌ మంత్రిగా భారత సంతతి మహిళ

తిరువనంతపురం: న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జెసిండా అర్డెర్న్‌‌ తన నూతన మంత్రివర్గాన్ని నేడు ప్రకటించారు. వీరిలో ఓ భారత సంతతి మహిళ ఉండటం విశేషం.  ఈ ప్రకటనతో ఇటు కేరళలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ రాష్ట్రానికి చెందిన మహిళ ప్రియాంకా రాధాకృష్ణన్‌.. న్యూజిలాండ్‌ మంత్రివర్గంలో చోటుసంపాదించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించటమే ఇందుకు కారణం. ప్రియాంక ‘కమ్యూనిటీ అండ్‌ వాలంటరీ’ శాఖ మంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. 42 ఏళ్ల ప్రియాంక పూర్వీకులు కేరళకు చెందినవారు కాగా.. ఈమె చెన్నైలో పుట్టి, సింగపూర్‌లో పెరిగారు. ఈమె తాత కోచి జిల్లాలోని పరవూర్‌లో ప్రముఖ వైద్యులు, కమ్యూనిస్టు నేత.

ఉన్నత విద్య కోసం న్యూజిలాండ్‌ వెళ్లిన ప్రియాంక‌.. అనంతరం ఆ దేశ పౌరసత్వం తీసుకున్నారు. క్రైస్ట్‌చర్చ్‌లో స్థిరపడ్డ రాధాకృష్ణన్‌ 2004 నుంచి లేబర్ పార్టీ తరఫున ఆ దేశ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆక్లాండ్‌ నుంచి రెండు సార్లు పార్లమెంటు సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. గత సంవత్సరం ఓనం పండగకు ఆ దేశ ప్రధాని జెసిండా  కేరళీయులందరికీ శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో.. ప్రియాంక పేరు మారుమోగిపోయింది. తనకు మలయాళ గీతాలంటే ఇష్టమని పేర్కొన్న ఈ న్యూజిలాండ్‌ మంత్రి.. తన అభిమాన గాయకుడు జేసుదాసు అని కూడా పలుమార్లు తెలిపారు.

Advertisement

Advertisement


మరిన్ని