అమెరికా పౌరసత్వం.. ఇకపై మరింత కష్టం
అమెరికా పౌరసత్వం.. ఇకపై మరింత కష్టం

వాషింగ్టన్‌: అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు నిర్వహించే అర్హత పరీక్షా విధానాన్ని సవరించినట్టు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) ఇటీవల ప్రకటించింది. మౌఖిక రూపంలో ఉండే ఈ పరీక్ష తయారీలో భాగంగా అభ్యర్థులు అమెరికాను గురించి మరింత సమగ్రంగా తెలుసుకునే వీలు కలుగుతుందని అధికారులు వివరించారు. కొంతకాలం పాత, కొత్త విధానాలులు రెండూ అమలులో ఉంటాయని.. డిసెంబర్‌ 1 నుంచి దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు కొత్త విధానంలో పరీక్షను నిర్వహిస్తామని వారు వివరించారు. ఈ అర్హత పరీక్షలో ఇంగ్లిష్‌, పౌరశాస్త్రానికి సంబంధించిన రెండు భాగాలుంటాయి. కాగా, ఇంగ్లీషు విభాగంలో ఏ మార్పులేదని అధికారులు వివరించారు.

మార్పులివే..

గతంలో అమెరికా చరిత్ర, ప్రభుత్వాన్ని గురించిన వంద ప్రశ్నలపై పరీక్ష నిర్వహించేవారు. ఇక ఇప్పుడు ఆ సంఖ్య 128 కి పెరిగింది. వాటిలో నుంచి అడిగే పది ప్రశ్నల్లో ఆరింటికి సరైన సమాధానం చెబితే ఉత్తీర్ణులైనట్టు పరిగణించేవారు. కాగా, నూతన విధానంలో ఉత్తీర్ణులు కావాలంటే.. అభ్యర్ధులు మొత్తం 20 ప్రశ్నలకు గాను  కనీసం పన్నెండు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఉత్తీర్ణతకు 60శాతం అవసరం. ఆరు ప్రశ్నల కంటే పన్నెండు ప్రశ్నలకు జవాబివ్వటం కష్టమేనని పరిశీలకులు అంటున్నారు. అంతేకాకుండా నూతన విధానంలో పరీక్ష కఠినంగా ఉందని.. రాజకీయ కారణాలతోనే ఈ మార్పులు చేశారని నిపుణులు అంటున్నారు.

ఇక అమెరికాలో పౌరసత్వం పొందుతున్న విదేశీయుల్లో భారతీయులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. గత పన్నెండు నెలల కాలంలో 61 వేల మందికి పైగా భారతీయులకు అగ్రరాజ్య పౌరసత్వం లభించింది. కాగా ఆ ముందు సంవత్సరం ఈ సంఖ్య 52 వేలుగా ఉందని గణాంకాలు తెలిపాయి.

Advertisement

Advertisement


మరిన్ని