దారిద్ర్యరేఖ దిగువన భారతీయ అమెరికన్లు!
దారిద్ర్యరేఖ దిగువన భారతీయ అమెరికన్లు!

వాషింగ్టన్‌: భారతీయ అమెరికన్ల విషయంలో పేదరికం గురించి నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అగ్రరాజ్యంలో నివసిస్తున్న వారిలో సుమారు 6.5 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన నివసిస్తున్నారని తేలింది. జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన దేవేశ్‌ కపూర్‌, జషాన్‌ బజ్వాత్‌ అనే విద్యావేత్తలు ఈ సర్వే నిర్వహించారు.

అగ్రరాజ్యంలో ఉన్న సుమారు 42 లక్షల భారతీయుల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు సుమారు 6.5 శాతమని ఈ సర్వే వెల్లడించింది. కరోనా రక్కసి ప్రభావంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పరిశీలకుల అభిప్రాయపడ్డారు. పేదరికంలో మగ్గుతున్న భారతీయుల్లో బెంగాలీలు, పంజాబీలు అధికంగా ఉన్నారని వారు తెలిపారు. ఇక్కడి భారతీయుల్లో అసహాయ స్థితిలో ఉన్నవారిని గురించి అవగాహన కల్పించేందుకే తాము ఈ అధ్యయనం చేపట్టినట్టు వారు వివరించారు.

‘‘అమెరికాలో కొవిడ్‌-19 ఇక్కడి భారతీయుల ఆరోగ్య, ఆర్థిక స్థితిని దిగజారుస్తోంది. ఎన్నారైలంటే సంపన్నులనే అభిప్రాయంలో ఉన్న నిజానిజాలను తెలియజేసి.. ఇక్కడి నిజమైన పరిస్థితిని తెలిపేందుకు ఇదే సరైన సమయం. ఈ అంశంపై దృష్టి సారించడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది’’ అని ఇండియాస్పోరా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు ఎంఆర్‌ రంగస్వామి అన్నారు.

Advertisement


మరిన్ని