ట్రంప్‌ కనీస విధుల్నీ నిర్వర్తించలేదు: కమలా హారిస్‌
ట్రంప్‌ కనీస విధుల్నీ నిర్వర్తించలేదు: కమలా హారిస్‌

వాషింగ్టన్‌: అమెరికా ప్రజల శ్రేయస్సు పట్ల అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించారని డెమొక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్ ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఓ అధ్యక్షుడిగా నిర్వహించాల్సిన కనీసం విధుల్ని కూడా ఆయన సమర్థంగా చేపట్టలేకపోయారన్నారు. కొవిడ్‌ కట్టడి విషయంలో తీవ్ర అశ్రద్ధ వహించారని విమర్శించారు. గురువారం ‘రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌’లో ట్రంప్‌ కీలక ‘యాక్సెప్టెన్స్‌ స్పీచ్‌’కి కొన్ని గంటల ముందు కమల ఈ విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అధ్యక్షుడిగా అమెరికా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానంటూ దేవుడి సాక్షిగా ప్రజల సమక్షంలో చేసిన ప్రమాణాన్ని ట్రంప్‌ ఏమాత్రం గుర్తెరిగి ప్రవర్తించలేదని కమలా హారిస్‌ విమర్శించారు. ప్రజల్ని రక్షించుకోవడం ఆయన విధి అని.. కానీ, దాన్ని నిర్వర్తించడంలో ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారన్నారు. ట్రంప్‌ తన అసమర్థతను బటయపెట్టుకోవడం కొత్తేమీ కాదని విమర్శించారు. కానీ, జనవరిలో ప్రపంచాన్నే కబళించే వైరస్‌ వెలుగులోకి వచ్చినపుడు ఆయన అసమర్థత మరింత శృతిమించిందన్నారు. వైరస్‌ ముప్పుని నిరాకరిస్తూ పెద్ద తప్పిదానికి పాల్పడ్డారన్నారు. ‘వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. త్వరలో వైరస్‌ అంతం చేసే అద్భుతం జరగబోతోంది..’ వంటి వ్యాఖ్యలతో ప్రజల్ని మోసం చేశారన్నారు.

మరోవైపు డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్‌ మాత్రం ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారని కమలా హారిస్‌ చెప్పుకొచ్చారు. ముందు చూపుతో వ్యవహరించిన బైడెన్‌.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు పటిష్ఠ ప్రణాళిక అవసరమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వచ్చారన్నారు.


మరిన్ని