ఓడిపోయే అవకాశమే లేదు!: ట్రంప్
ఓడిపోయే అవకాశమే లేదు!: ట్రంప్

వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చేతిలో పరాజయం పాలైనప్పటికీ, ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు, కోర్టు తీర్పులు కూడా ఆయనకు ప్రతికూలంగానే వస్తున్నాయి. అయినా, శ్వేతసౌధాన్ని విడిచిపెట్టడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ క్రమంలో ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఎన్నికల్లో ఓడిపోయే అవకాశమే లేదు!’ అంటూ ట్వీట్ చేయడంతో పాటు ఓ వీడియోను షేర్ చేశారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటి వీడియో అది. అందులో భారీ సంఖ్యలో హాజరైన అమెరికన్లు..ట్రంప్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. 

అయితే ట్రంప్‌ తీరు విమర్శలకు దారితీస్తోంది. ‘సరే, ఇందులో ఎక్కువలో ఎక్కువగా 25 వేల మంది ఉన్నారనుకుందాం. అధ్యక్ష పదవి అధిష్ఠించడానికి 77 మిలియన్ల ఓట్లు అవసరమని మీరు గ్రహించాలి. లేకపోతే మీకు చిన్నపాటి లెక్కలు అర్థం కావడం లేదా?’ అని ఓ నెటిజన్‌ ఆ వీడియోనుద్దేశించి ట్వీట్ చేశారు. మరోవైపు, ఎన్నికల్లో మోసం జరిగిందంటూ ట్రంప్ పోస్టు చేసిన సందేశాలు కొన్నింటిని వివాదాస్పదమంటూ ట్విటర్ లేబుల్ చేసిన సంగతి తెలిసిందే.


Advertisement

Advertisement


మరిన్ని