అమెరికన్‌ ఓటర్లకు ట్విటర్‌ అవగాహన
అమెరికన్‌ ఓటర్లకు ట్విటర్‌ అవగాహన

నేషనల్‌ ఓటర్ రిజిస్ట్రేషన్‌ డే సందర్భంగా ప్రారంభం

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆ దేశ ఓటర్లకు ఎన్నికల అవగాహన పెంపొందించేందుకు ఓ భారీ ప్రయత్నాన్ని ప్రారంభించినట్టు సామాజిక మాధ్యమం ట్విటర్‌ ప్రకటించింది. మంగళవారం అమెరికా జాతీయ ఓటరు నమోదు దినోత్సవం సందర్భంగా @TwitterGov పేరుతో ఓ ఆన్‌లైన్‌ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఆ దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, నిబంధనలను గురించిన పూర్తి సమాచారం ఓటర్లకు అందుతుందని సంస్థ వెల్లడించింది. దీనికోసం తాము అధికారిక ‘నేషనల్‌ ఓటర్ రిజిస్ట్రేషన్‌ డే’ కార్యక్రమంతో సంయుక్తంగా కృషి చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ సమాచారం 40 భాషల్లో అందుబాటులో ఉంటుందని, యూజర్లు తమకు అనువైన భాషను ఎంచుకోవచ్చని ట్విటర్‌ వెల్లడించింది.

ఈ కార్యక్రమం ద్వారా మరింత మంది ఓటర్ల నమోదుకు, రిజిస్ట్రేషన్ల నిర్ధారణకు, ఎన్నికల చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా వెలిబుచ్చేందుకు వీలవుతుందని ట్విటర్‌ ఈ సందర్భంగా వివరించింది. కీలక వ్యక్తుల ఖాతాలకు మరింత భద్రత, తప్పుడు సమాచారం, దుష్ప్రచారాన్ని కట్టడి చేసేందుకు వీలుగా తాము అనేక చర్యలు చేపడుతున్నట్టు ట్విటర్‌ తెలిపింది. ట్విటర్‌ను వాడుతున్న పదిమందిలో తొమ్మిది మంది నవంబర్‌ 3 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయటానికి సిద్ధంగా ఉండగా.. మిగిలిన వారిలో సగానికి పైగా ఎన్నికల సమాచారం, 2020 ఎన్నికల్లో ఓటు వేసే విధానానికి సంబంధించిన సమాచారం లభించలేదని తెలిపినట్లు ట్విటర్‌ వివరించింది.

Tags :

మరిన్ని