హెచ్‌ 1బీ ఉద్యోగాల శిక్షణకు 150 మి.డాలర్లు
హెచ్‌ 1బీ ఉద్యోగాల శిక్షణకు 150 మి.డాలర్లు

కీలక రంగాల్లో నైపుణ్యాల పెంపునకు కేటాయించిన అగ్రరాజ్యం

వాషింగ్టన్‌: తమ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేసే కీలక రంగాల్లో నైపుణ్యాల మెరుగుదలకు భారీ మొత్తాన్ని కేటాయిస్తున్నట్టు అగ్రరాజ్యం ప్రకటించింది. మధ్య స్థాయి నుంచి ఉన్నత స్థాయి నైపుణ్యాలు అవసరమయ్యే హెచ్‌ 1బీ ఉద్యోగాలలో మానవవనరులకు శిక్షణ ఇచ్చేందుకు 150 మిలియన్‌ డాలర్లు వినియోగించనున్నట్టు అమెరికా కార్మికశాఖ వెల్లడించింది. ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ఐటీ, సైబర్‌ భద్రత, ఆధునిక నిర్మాణాలు, రవాణా తదితర ముఖ్య రంగాల్లో ప్రస్తుత, భవిష్యత్తులో అవసరమయ్యే మానవ వనరుల సామర్ధ్యం పెంపుదలకు ఈ ‘హెచ్‌ 1బీ వన్‌ వర్క్‌ఫోర్స్‌’ నిధులు వినియోగిస్తామని ఆ దేశ కార్మికశాఖ తెలిపింది.

కొవిడ్‌-19 ప్రభావంతో మానవ వనరుల సరఫరాకు అంతరాయం కలగటమే కాకుండా..  విద్య, ఉద్యోగ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు సంబంధిత సంస్థలు వెనుకాడుతున్నట్లు అమెరికా ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌, దూరవిద్య తదితర సాంకేతిక విధానాల ద్వారా శిక్షణ అందజేస్తామని ఆ ప్రభుత్వం ప్రకటించింది. అర్హత ఉన్నవారికి వారి ప్రాంతాల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా హెచ్‌ 1బీ ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాల శిక్షణ కల్పిస్తామని తెలిపింది. స్థానిక నిరుద్యోగులు, ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు, అప్రెంటిస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారు శిక్షణలో భాగం కావచ్చని వివరించింది.

దేశంలో సమగ్ర ఉద్యోగ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు ఉపాధి, శిక్షణా విభాగం వెల్లడించింది. కరోనా అపరిమిత ప్రభావం చూపుతున్న ప్రస్తుత ఉద్యోగ వాతావరణంలో..  వివిధ వర్గాలకు చెందిన ఉద్యోగులందరూ తాము ‘ఒకే శ్రామిక శక్తి’ అనే ఆలోచనా విధానాన్ని అవలంబించాలని అమెరికా కార్మిక శాఖ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.

Advertisement


మరిన్ని