టైమ్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా బైడెన్‌-హారిస్‌
టైమ్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా బైడెన్‌-హారిస్‌

న్యూయార్క్‌: ఈ ఏటి మేటి వ్యక్తులుగా అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌, కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సంయుక్తంగా నిలిచారు. బైడెన్‌-హారిస్‌లను ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ప్రకటిస్తూ టైమ్‌ మ్యాగజైన్‌ 2020 కవర్‌పేజీని ఆ పత్రిక నేడు విడుదల చేసింది. దీనికి ‘అమెరికా చరిత్రను మారుస్తున్నారు’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. 

‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ తుది రేసులో ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌కేర్‌ వర్కర్లు, డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను దాటుకుని బైడెన్-హారిస్‌ ఈ ఘనత సాధించారు. ‘అమెరికా చరిత్రను మారుస్తున్నందుకు.. విభజన శక్తుల కంటే సానుభూతి గొప్పదని  నిరూపించినందుకు.. వైరస్‌ విపత్కర పరిస్థితుల్లో వైద్యంపై దృష్టిపెట్టినందుకు వీరిని ఈ ఏటి మేటి వ్యక్తులను ఎంపిక చేసినట్లు టైమ్‌ మ్యాగజైన్‌ వెల్లడించింది. 

1927 నుంచి ఏటా టైమ్‌ మ్యాగజైన్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను ప్రకటిస్తూ వస్తోంది. ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులను పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గౌరవిస్తోంది. 2019లో యువ పర్యావరణ కార్యకర్త, స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్‌ను మేటి వ్యక్తిగా ప్రకటించింది. 2016లో డొనాల్డ్‌ ట్రంప్‌ను పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. 

ఈ ఏడాది నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై డెమొక్రటిక్‌ నేత జో బైడెన్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో బైడెన్‌ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా.. ఫలితాలు వెలువడి నెల రోజులు గడిచినా ట్రంప్ ఇంకా తన ఓటమికి అంగీకరించకపోవడం గమనార్హం. 

ఇవీ చదవండి..

బాపూ విలువలకు పట్టం.. అమెరికా చట్టం

బ్రిటిష్‌ ఇండియన్‌ రచయిత్రికి హెజెల్‌ టిల్ట్‌మన్‌ బహుమతి
 


Advertisement


మరిన్ని