అమెరికాలో ఒక్కరోజే 1.2లక్షల కొవిడ్‌ కేసులు
అమెరికాలో ఒక్కరోజే 1.2లక్షల కొవిడ్‌ కేసులు

అగ్రరాజ్యంలో కోరలుచాస్తున్న కొవిడ్‌

వాషింగ్టన్‌: ఎన్నికల ఫలితాల హడావుడిలో ఉన్న అగ్రరాజ్యం అమెరికాను  కొవిడ్‌ మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఈ సంఖ్య ఏకంగా లక్ష దాటడం భయాందోళనకు గురిచేస్తోంది. ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంటే.. మరోవైపు కరోనా పంజా విసురుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటల నుంచి గురువారం రాత్రి 8.30 గంటల వరకు 1,23,085 కొత్త కేసులు నమోదైనట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ వెల్లడించింది. దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 96లక్షలు దాటింది. ఇక వరుసగా మూడో రోజు వెయ్యి మందికి పైగా కరోనాకు బలయ్యారు. కొవిడ్‌ కారణంగా గురువారం మరో 1,226 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,34,000 దాటింది. 

కరోనా కారణంగా అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్‌ కూడా వైరస్‌ బారిన పడి కోలుకున్నారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇది కీలకాంశమైంది. ఓ వైపు దేశంలో కరోనా త్వరలోనే కనుమరుగవుతుందని ట్రంప్‌ చెప్పగా.. పరిస్థితి తీవ్రంగా ఉందని ప్రభుత్వ వైద్య నిపుణులే హెచ్చరించడం గందరగోళానికి దారితీసింది. ఇదిలా ఉండగా.. కొవిడ్‌పై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును ప్రధానాస్త్రంగా మల్చుకున్న ప్రత్యర్థి డెమొక్రటిక్‌ నేత జో బైడెన్‌ ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడిని పలుమార్లు ఎండగట్టారు. ఈ ప్రచారం బైడెన్‌ను సానుకూలంగా మారినట్లే కన్పిస్తోంది. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో  బైడెన్‌ ఆధిక్యం కనబరుస్తున్నారు. మరిన్ని