బైడెన్‌కు అభినందన సందేశాల నిలిపివేత?
బైడెన్‌కు అభినందన సందేశాల నిలిపివేత?

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు సహకరించేందుకు ట్రంప్‌ కార్యవర్గం ససేమిరా అంటోంది. బైడెన్‌ను అభినందిస్తూ విదేశాల నేతలు పంపిస్తున్న సందేశాలను ఆయనకు అందజేయకుండా నిలిపివేసింది. దీంతో ఈ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించడానికి ట్రంప్‌ కార్యవర్గం ఏమాత్రం సిద్ధంగా లేదని తెలుస్తోంది. 

ఇప్పటికే అమెరికాలో మీడియా సంస్థలు బైడెన్‌కు 290 స్థానాలు వస్తాయని ప్రకటించి ఐదు రోజులు దాటిపోయింది. దీంతో చైనా, రష్యా వంటి దేశాలు తప్ప పలువురు నాయకులు అభినందన సందేశాలు పంపుతున్నారు. సాధారణంగా ఇలా ఆయా దేశాల నుంచి వచ్చే అధికారిక సందేశాలను అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విభాగానికి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌గా మైక్‌ పాంపియో ఉన్నారు. దీంతో ఈ విభాగం అధికార మార్పిడికి సమస్యలను సృష్టిస్తోంది. ఇప్పటికే పాంపియో దీనిపై అధికారికంగా స్పందించారు. ‘ట్రంప్‌కే రెండోసారి అధికార మార్పిడి సజావుగా సాగుతుంది’ అని వ్యాఖ్యానించారు. 

దీంతో చాలా విదేశీప్రభుత్వాలు ఒబమా మాజీ అధికారుల ద్వారా గానీ, ఇతర మార్గాల్లోగానీ సంప్రదించాలని చూస్తున్నాయి. ది జనరల్‌ సర్వీస్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి భవనాల స్వాధీనం, ఇంటెలిజెన్స్‌ బ్రీఫింగ్స్‌లో సమస్యలు సృష్టిస్తున్నారు. దీంతో బైడెన్‌ బృందం అధికార మార్పిడి కోసం న్యాయపోరాటం చేయాలని భావిస్తోంది. రిపబ్లికన్‌ పార్టీలోని జార్జి డబ్ల్యూ బుష్‌ వంటి సీనియర్లు కూడా బైడెన్‌కు మద్దతు పలుకుతున్నారు.


మరిన్ని