చైనాకు అమెరికా షాక్‌.. ఆ యాప్‌లపై నిషేధం
చైనాకు అమెరికా షాక్‌.. ఆ యాప్‌లపై నిషేధం

వాషింగ్టన్‌: అమెరికా అన్నంత పనే చేసింది. కరోనా వైరస్‌ మహమ్మారికి కారణమైన చైనా తీరుపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం డ్రాగన్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటనలో పేర్కొంది. అమెరికా పౌరుల వ్యక్తిగతమైన సమాచారాన్ని చైనా సేకరిస్తోందని వాణిజ్య విభాగం కార్యదర్శి విల్‌బర్‌ రోస్‌ వెల్లడించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌కు చెందిన టిక్‌టాక్‌ కంపెనీ 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని యాక్సిస్‌ చేస్తున్న నేపథ్యంలో భద్రతారంగం నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మిగతా ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని వాణిజ్య విభాగం తెలిపింది. 

చైనాపై చర్యలు తప్పవంటూ ఇప్పటికే హెచ్చరిస్తున్న అమెరికా.. టిక్‌టాక్‌ యాప్‌ నిషేధాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్టు ఇటీవల సంకేతాలు ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఇటీవల ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధించే విష‌యాన్ని త‌మ ప‌రిపాల‌నా విభాగం ప‌రిశీలిస్తోందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

చైనా దూకుడుతో గల్వాన్‌ సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో టిక్‌టాక్‌,  వీచాట్‌తో పాటు వందకు పైగా యాప్‌లపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే.


మరిన్ని