బాలుకు స్వర నివాళులర్పించిన తానా 
బాలుకు స్వర నివాళులర్పించిన తానా  

న్యూయార్క్‌: గాన గంధర్వుడు, పద్మభూషణ్‍ డాక్టర్ ఎస్‍.పి బాలసుబ్రహ్మణ్యం మృతికి సంతాపంగా "స్వరశిల్పికి స్వర నివాళి" పేరుతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆన్‍లైన్‍ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ గాయనీ గాయకులు పాల్గొని ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళులు అర్పించారు. దాదాపు 50,000 మందికిపైగా ఈ స్వర నివాళిని వీక్షించారు. ప్రముఖ గాయని పద్మభూషణ్ డాక్టర్ సుశీల, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు, సునీత తదితరులు ఎస్పీబీతో తమ అనుభవాలను పంచుకున్నారు. 
తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, కార్యదర్శి రవి పొట్లూరి, కల్చరల్‍ కో ఆర్డినేటర్‍ సునీల్‍ పాంత్రా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజేశ్వరి ఉదయగిరి యాంకర్‍గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి మాట్లాడుతూ ‘బాలుగారి మృతి చాలా బాధాకరం. 2009లో చికాగోలో జరిగిన 17వ తానా మహాసభలలో ఆయనకు తానా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసి సత్కరించింది. ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్‍కు తానా కూడా తనవంతు మద్దతు ఇస్తుందని’ అన్నారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి మాట్లాడుతూ ‘బాలసుబ్రహ్మణ్యం పాటలను వింటూ జీవితాన్ని ఆస్వాదించాం. ఆయన జీవించిన 27,000 రోజుల్లో పాడిన 40,000 పాటలే ఆయన్ను అమరజీవిగా నిలుపుతాయని’ పేర్కొన్నారు. తానా కల్చరల్‍ కో ఆర్డినేటర్‍ సునీల్‍ పాంత్రా మాట్లాడుతూ ‘స్వల్ఫవ్యవధిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు గాయనీ, గాయకులు, ప్రముఖులు హాజరుకావడం వారికి ఆ మహా గాయకుడిపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తోంది. తానా కల్చరల్‍ కో ఆర్డినేటర్‍గా బాలుగారితో తానా వేదికపై పాడుతాతీయగా లాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నానని’ చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్‍ డా.పి. సుశీల, పద్మశ్రీ డా.శోభారాజు, సునీత, ఉష, కౌసల్య, సంధ్య, శ్రీరామచంద్ర, రేవంత్‍, శ్రీకృష్ణ, సుమంగళి, పృథ్వీచంద్ర, అంజనా సౌమ్య, గీతామాధురి, సమీర భరద్వాజ్‍ హాజరయ్యారు. టీవీ ఏసియా, స్వరాజ్య ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి సహకరించారు.


మరిన్ని