కొవిడ్‌ టీకాతో అలర్జీ:  అమెరికా ఏమందంటే..
కొవిడ్‌ టీకాతో అలర్జీ:  అమెరికా ఏమందంటే..

వాషింగ్టన్‌: బ్రిటన్‌, అమెరికా దేశాల్లో కరోనా వైరస్‌ టీకా తీసుకున్న కొందరిలో అలెర్జీ సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ టీకాల వల్ల తీవ్ర దుష్ప్రభావానికి గురైన వారు రెండో డోసును తీసుకోవద్దంటూ.. అమెరికా ప్రభుత్వ సంస్థ ‘సెంటర్స్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్’ (సీడీసీ) ప్రకటించింది. కొవిడ్‌ టీకా అనంతరం స్వల్ప అస్వస్థత కాకుండా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సినంత స్థాయిలో ఆరోగ్య సమస్యలు తలెత్తితే రెండో డోసును తీసుకోవద్దంటూ వైద్య నిపుణులు సూచించారు. వ్యాక్సినేషన్‌ వల్ల అలెర్జీ తలెత్తిన కేసుల్లో వైద్య నివేదికలను తాము పరిశీలిస్తున్నామని.. అలెర్జీలు ఉన్నవారు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకునే విషయంలో మార్గదర్శకాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

కరోనా టీకా సమ్మేళనాల్లో.. దేని పట్ల అయినా అలెర్జీ ఉన్న వారు కరోనా టీకాను తీసుకోవద్దని అక్కడి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా ఆహారం, పెంపుడు జంతువులు, రబ్బరు లేదా నిర్దిష్ట వాతావరణ పరిస్థితుల వల్ల ఆరోగ్య సమస్యలకు గురయ్యే వారు.. వైద్య సలహా అనంతరం మాత్రమే టీకాను తీసుకోవాలని నిపుణులు తెలిపారు. కాగా, ఇక్కడ ఇప్పటి వరకు ఆ దేశంలో టీకా వల్ల ఐదుగురిలో అలర్జీ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందిచడం తీవ్రమైన అలెర్జీ (అనాఫిలాక్సిస్‌)కి దారి తీస్తుంది. ఇది కొన్ని సార్లు ప్రాణాంతకంగాకూడా మారవచ్చు. ఈ నేపథ్యంలో అలెర్జీ ఉన్నవారిని టీకా తీసుకోవద్దంటూ.. బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి

ఫైజర్‌ టీకాలో అలర్జీ: సంస్థ ఏమందంటే..

అలర్జీ ఉంటే.. టీకా తీసుకోకండి


మరిన్ని