అధికారంలోకి వస్తే..కోటి మందికి పౌరసత్వం!
అధికారంలోకి వస్తే..కోటి మందికి పౌరసత్వం!

డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ ప్రకటన

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌, ప్రత్యర్థి బైడెన్‌లు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా పలు హామీలను గుప్పిస్తున్నారు. దీనిలో భాగంగా తాము అధికారంలోకి వస్తే కోటి మందికిపైగా అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తామని డెమొక్రాటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ ప్రకటించారు. దేశాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కోవడం, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు విదేశాలతో సత్సంబంధాలను నెలకొల్పడమే తమముందున్న ప్రాధాన్యాలని బైడెన్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ప్రస్తుతం అమెరికా వలసవాద సంక్షోభం ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు దాదాపు కోటి 10లక్షల (11మిలియన్ల) వలసవాదులు పౌరసత్వం పొందేందుకు వీలు కల్పించే బిల్లును సెనెట్‌కు పంపిస్తాం’ అని బైడెన్‌ స్పష్టంచేశారు. ఒకవేళ అధికారంలోకి వస్తే..దేశ, విదేశాంగ విధానంపై తొలి 30రోజుల్లో మీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్న ప్రశ్నకు ఆయన‌ స్పందించారు. ‘ఇప్పటి నుంచి జనవరి 2021 వరకు ఎన్నో తప్పులు జరుగవచ్చు. కానీ, వచ్చే నాలుగేళ్లలో ప్రస్తుతం ఉన్న మాదిరిగా మాత్రం అమెరికా ఉండదు’ అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం కరోనాను ఎదుర్కొంటున్న తీరు, ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించడంలో ట్రంప్‌ విఫలమైనట్లు బైడెన్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. వీటితోపాటు వలసవాదంపై ట్రంప్‌ తీరును తప్పుబట్టారు. తాము అధికారంలోకి వస్తే వీటిన్నింటినీ గాడిలో పెడతామని బైడెన్‌ స్పష్టంచేశారు.

ఇదిలాఉంటే, అక్రమంగా అమెరికాకు చేరుకున్న వలసవాదులను బహిష్కరించాలని ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతమున్న వలసవాద చట్టం అన్యాయంగా ఉందని చెబుతున్నారు. మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించడం ద్వారానే ఈ వలసలకు అడ్డుకట్టవేయొచ్చని పేర్కొంటున్నారు. అంతేకాకుండా నిత్యం దాదాపు 2వేల మంది అక్రమంగా చొరబడుతున్నట్లు ట్రంప్‌ ఇప్పటికే పేర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో మెక్సికోతోపాటు వివిధ దేశాలనుంచి వలసవచ్చిన వారిని ఆకర్షించేందుకు బైడెన్‌ ప్రయత్నిస్తోన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


మరిన్ని