సందడిగా ‘ఆటా’ ఉగాది సాహిత్య సదస్సు
సందడిగా ‘ఆటా’ ఉగాది సాహిత్య సదస్సు

వాషింగ్టన్‌: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో ఉగాది సాహిత్య సదస్సు ఈ నెల 17న శనివారం ఘనంగా జరిగింది. ఆటా అధ్యక్షుడు భువనేశ్‌ బూజాల, ఆటా కార్యవర్గ బృందం జూమ్‌ వేదికగా  ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సాహిత్య వేదిక కమిటీ అధిపతి శారద సింగిరెడ్డి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సభకు స్వాగతం పలికారు. సాహిత్యం కేవలం మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుందని తెలిపారు. ఆటా సాంస్కృతిక విభాగం ఉపాధిపతి యామిని స్ఫూర్తి మేడూరు ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. కృష్ణవేణి మల్లవజ్జల ఈ  సాహిత్య సదస్సుకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆటా అధ్యక్షుడు భువనేశ్ తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటా సంస్థ తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ, మన సాంప్రదాయాన్ని ప్రేమిస్తూ, మన విలువలని కాపాడుకుంటూ,  మన పండగలను బంధు మిత్రులతో జరుపుకోవడం ద్వారా భావితరాలకు అందిస్తూ ముందుకెళ్తోందన్నారు. ఆటా ఎప్పటికీ మన భాషకు, సాహిత్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. 

శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ‘పంచాంగ శ్రవణం’ వినిపించారు. పంచాంగ శ్రవణంలో భాగంగా  ప్లవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయనే విషయంతో పాటు అన్ని రాశుల ఆదాయ వ్యయాలను, గ్రహగతులను, అలాగే వ్యక్తిగత అనుకూలతల కొరకు సలహాలు సూచనలను వివరించారు. మహా సహస్రావధాని, ప్రవచన కిరీటి డాక్టర్‌ గరికపాటి నరసింహారావు ‘ఆశావాది - ఉగాది’ అనే అంశంపై ప్రసంగించారు. మనిషి నిత్య జీవితంలో దురాశకు అలాగే  నిరాశకు రెండింటికీ లోనుకాకూడదని, ఆశావాదిగా ఉండాలని సూచించారు. కేవలం నేటి గురించి మాత్రమే ఆలోచించాలి అని అప్పుడే ప్రశాంతమైన జీవితం సాధ్యమవుతుందని చెప్పారు.  ఉగాది పచ్చడి లాగానే జీవితంలో కష్టసుఖాలన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడే జీవితం విలువ తెలుస్తుందని వివరించారు. 

ప్రముఖ సినీగేయ రచయిత వనమాలి మారుతున్న కాలంలో సినీ గేయ రచయితల పరిస్థితులు, తెలుగు భాషకు తగ్గుతున్న ప్రాధాన్యత తదితర అంశాలతో కూడిన చక్కటి కవితను వినిపించారు. హాస్యావధాని డా. శంకర్ నారాయణ ‘ఖతర్నాక్ మన్మథ కాస్త జాగ్రత్త’ అంటూ తనదైన శైలిలో హాస్యపు జల్లులతో కవితలను చదివి వినిపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ప్రముఖ రచయిత కవి డాక్టర్‌ అఫ్సర్ కరోనా సమయంలో ఏర్పడుతున్న పరిస్థితుల గురించి వివరిస్తూనే మరోవైపు, ప్లవ నామ సంవత్సరంలో ‘భావి ఆశలుగా భ్రాతగా ఉండాలి’ అనే చక్కటి కవితను చదివి వినిపించారు. ప్రముఖ కథా రచయత, పాత్రికేయులు ముని సురేష్ పిళ్ళై ‘ఎందుకు’ అనే కథా శీర్షికతో కొవిడ్ పరిస్థితుల్లో నెలకొన్న దుస్థితిని తెలియజేస్తూ ఈ ఉగాది నుంచైనా బాగుండాలనే అద్భుతమైన సందేశంతో కూడిన కవితను వినిపించారు. ఈ సదస్సులో పాల్గొన్న అతిథులు, కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ సాహిత్య వేదిక కమిటీ ఉపాధిపతి పవన్‌ గిర్ల కృతజ్ఞతలు తెలిపారు. 


మరిన్ని