అందమైన ఐలాండ్‌కి కేర్‌టేకర్‌ అవుతారా?
అందమైన ఐలాండ్‌కి కేర్‌టేకర్‌ అవుతారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐలాండ్‌ను చూడాలని ఎవరు కోరుకోరు చెప్పండి. చుట్టూ సముద్రం.. ఒడ్డు, చెట్లు, ఆహ్లదకరమైన వాతావరణం ఎంతో ఆకట్టుకుంటుంది. జీవితంలో ఎప్పుడో ఒకసారి వెళ్తేనే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంటుంది కదా..! మరి అక్కడే శాశ్వత ఉద్యోగం లభిస్తే? ఆహా.. భలే ఉంటుంది అనుకుంటున్నారా! అలాంటి ఉద్యోగం ఇస్తామంటోంది.. ఆస్ట్రేలియాలోని ‘ది గ్రేట్‌ బారియర్‌ రీఫ్‌ మెరైన్‌ పార్క్‌’ సంస్థ.

ఈ సంస్థ కీన్స్‌లాండ్‌కు 9 మైళ్ల దూరంలో ఉండే పలు చిన్న చిన్న ఉష్టమండల ద్వీపాలను పరిరక్షిస్తుంటుంది. ఈ ద్వీపాలు కరోనాకు ముందు పర్యాటకులతో సందడిగా ఉండేవి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ వల్ల ఎవరూ రావట్లేదు. అయితే వీటిలోనే 55 ఎకరాల విస్తీర్ణంలో లో ఇసిల్స్‌ అనే పగడపు దీవి ఉంది. దీన్ని పరిరక్షించడం కోసం కేర్‌టేకర్‌ పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్‌ 25 వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ఇక్కడ కేర్‌టేకర్‌గా పనిచేయడం అంత సులువు కాదని ముందే చెబుతున్నారు. కేవలం కేర్‌టేకర్స్‌ మాత్రమే ఇక్కడ ఉండాలి. ద్వీపంలోని భవనాలు, మౌలిక వసతులు, సోలార్‌, డ్రైనేజ్‌ వ్యవస్థను ఎల్లప్పుడు పరిశీలిస్తుండాలి. చెట్లను సంరక్షిస్తూ.. ద్వీపంలో ఉన్న పక్షుల సంఖ్యను లెక్కపెట్టాలి. సాధారణ స్థితులు వచ్చి పర్యాటకులు సందర్శనకు వస్తే వారికి అతిథి మర్యాదలు చేయాలి. ఎన్ని ఉద్యోగాలు, ఎంత జీతం అనే విషయాలు అధికారులు వెల్లడించలేదు గానీ.. అభ్యర్థులు మాత్రం త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని