అమెరికా దళాల ఉపసంహరణ ప్రారంభం
అమెరికా దళాల ఉపసంహరణ ప్రారంభం

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌లో దాదాపు రెండు దశాబ్దాల పాటు యుద్ధాన్ని కొనసాగించిన అమెరికా, నాటో సేనల చివరి దశ ఉపసంహరణ శనివారం లాంఛనంగా ప్రారంభమయ్యింది. వేసవి కాలం ముగిసే సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా సైనికులు 2,500-3500 మంది, నాటో సైనికులు ఏడు వేల మంది వరకూ అఫ్గానిస్థాన్‌లో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించినట్లుగానే మే ఒకటో తేదీ నుంచి సాయుధ బలగాలు వెనక్కు మళ్లడం మొదలయ్యింది. దీనికన్నా ఒక్కరోజు ముందే సైనిక సామగ్రిని సి-17వంటి భారీ కార్గో విమానాల్లో తరలించడాన్ని చేపట్టారు. 2001 సెప్టెంబరు 11న న్యూయార్క్‌పై వరుస ఉగ్రదాడుల ఘటన తర్వాత అదే ఏడాది అక్టోబరు 7న అమెరికా, నాటో దళాలు అఫ్గానిస్థాన్‌లో పాదం మోపాయి. రెండు నెలల తర్వాత తాలిబన్లు అధికారాన్ని కోల్పోయారు. అల్‌ఖైదా ఓటమితో పరారైన ఆ ఉగ్రసంస్థ నేత ఒసామాబిన్‌ లాడెన్‌ను పాకిస్థాన్‌ భూభాగంలో అమెరికా నేవీకి చెందిన సీల్‌ దళం హతమార్చింది. సుదీర్ఘంగా యుద్ధం కొనసాగినా తాలిబన్లపై పూర్తిస్థాయిలో అమెరికా పట్టుసాధించలేకపోయింది. ఉపసంహరణ సమయంలో కాల్పులు జరపబోమన్న హామీని కూడా తాలిబన్ల నుంచి అమెరికా, నాటో దళాలు రాబట్టలేకపోయాయి. పైగా మే ఒకటో తేదీలోగా ఉపసంహరణ పూర్తి చేస్తామన్న ట్రంప్‌ ప్రభుత్వ వాగ్దానాన్ని వాషింగ్టన్‌ నిలబెట్టుకోలేక పోయిందంటూ తాలిబన్‌ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి.
* గత 20 ఏళ్లలో అఫ్గాన్‌లో యుద్దం కోసం అమెరికా రూ.148 లక్షల కోట్లు (2లక్షల కోట్ల డాలర్లు) ఖర్చు చేసినట్లు బ్రౌన్‌ యూనివర్సిటీ అంచనా వేసింది.
* అంతర్యుద్ధంలో 47,245 మంది అఫ్గాన్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 69వేల మంది వరకు అఫ్గాన్‌ సైనికులు మరణించి ఉంటారని అంచనా.
* అమెరికా సైనికులు 2,442 మంది చనిపోగా మరో 20,666 మంది గాయపడ్డారు. అమెరికా కాంట్రాక్టు ప్రైవేటుసెక్యూరిటీ సిబ్బంది 3,800మంది మృతి చెందారు.
* నాటో దేశాలకు చెందిన 1,144 మంది సిబ్బంది కూడా ప్రాణాలు విడిచారు.
* 2001లో తాలిబన్లు అధికారాన్ని కోల్పోయినా సుదీర్ఘ కాలంగా పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. 50శాతం వరకు అఫ్గానిస్థాన్‌ భూభాగం వారి ఆధిపత్యంలోనే ఉందని అంచనా. 

Advertisement

Advertisement


మరిన్ని