సింగపూర్‌లో భాగవత జయంత్యుత్సవాలు
సింగపూర్‌లో భాగవత జయంత్యుత్సవాలు

సింగపూర్: తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో 4వ అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆన్‌లైన్లో ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ లైవ్‌ ద్వారా వీటిని నిర్వహించారు. ఈ సారి ఉత్సవాలను రెండు రోజుల పాటు నిర్వహించారు. ఆగస్టు 11న కృష్ణాష్టమి సందర్భంగా భాగవత పారాయణం, భాగవత పద్య పఠనం, శ్రీ సూక్త పఠనం పోటీలు నిర్వహించారు. ఆగస్టు 15న పిల్లల పాటలు, పద్యాలు, నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. 

ఈ వేడుకలకు 200 మంది పిల్లలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీల్లో నమోదు చేసుకోగా, వారి నుంచి ఎంపికైన 25 మంది పిల్లలు, పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి తమ కళలను ప్రదర్శించి అందరినీ అలరించారు. సింగపూర్, ఇండియా నుంచే కాకుండా ఇతర దేశాల నుంచీ తెలుగువారు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచం నలుమూలల నుంచి 500 మందికి పైగా  వీక్షకులు ప్రత్యక్ష ప్రసారంలో చూసి ఆనందించారు.

శ్రీశ్రీశ్రీ అమృతానంద సరస్వతి సంయమీంద్ర మహాస్వాములవారు విశిష్ట అతిథిగా పాల్గొని భాగవత ప్రాశస్త్యాన్ని, చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా భాగవత ప్రచారానికి విశేష కృషి చేస్తున్న డాక్టర్ మురళీ మోహన్‌ను భాగవతరత్న పురస్కార ప్రదానంతో సత్కరించారు. పెద్ది సాంబశివరావు తెలుగుభాగవతం.ఆర్గ్ నుంచి సమకూర్చిన ‘పోతనామాత్య భాగవత పరిచయం - అష్టమ స్కంధం’ అనే డిజిటల్ పుస్తకాన్ని కినిగె ద్వారా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అంతర్జాలంలోని తెలుగు వారందరికీ ఉచితంగా అందజేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. అంతేకాక వినూత్నమైన పద్ధతిలో కథల పుస్తకాలను ఆగ్మెంటేడ్ రియాలిటీ (Augmented Reality) మొబైల్ యాప్‌తో కలిపి ప్రపంచంలోనే మొట్టమొదటి ‘లైవ్ కథల పుస్తకం’ను కథ- ఏఆర్‌.కామ్‌ అనే పేరుతో ఆవిష్కరించారు (www.katha-ar.com). ఈ అంతర్జాతీయ భాగవత జయంత్యుత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన తెలుగు భాగవత ప్రచార సమితి సభ్యులందరికీ నిర్వహణ కమిటీ తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.


మరిన్ని