‘అంతర్జాతీయ శక్తిగా భారత్‌ను స్వాగతిస్తున్నాం’
‘అంతర్జాతీయ శక్తిగా భారత్‌ను స్వాగతిస్తున్నాం’

ఇండియా ప్రాముఖ్యతను గుర్తించిన బైడెన్ పాలకవర్గం

వాషింగ్టన్‌: భారత్‌ అంతర్జాతీయ శక్తిగా అవతరించడాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పాలకవర్గం స్వాగతించింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికాకు భారత్‌ కీలక భాగస్వామి అని తెలిపింది. ప్రాంతీయంగా శాంతి భద్రతలను నెలకొల్పడంలో భారత్‌ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెగ్‌ ప్రైస్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ వేదికపై భారత్ ప్రాముఖ్యతను గుర్తిస్తూ బైడెన్‌ పాలకవర్గం ప్రకటన చేయడం ఇదే తొలిసారి.

అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఉభయులు ధీమా వ్యక్తం చేశారు. అలాగే మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు, దాని పర్యవసనాలపైనా చర్చించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సహకారం, కొవిడ్‌ మహమ్మారి, వాతావరణ మార్పులపైనా మాట్లాడుకున్నారు. అమెరికాకు భారత్‌ ప్రధాన వాణిజ్య భాగస్వామి అని ప్రైస్‌ తెలిపారు. భారత్‌లో ఎఫ్‌డీఐలకు అమెరికా కంపెనీలు కేంద్రంగా ఉన్నాయని గుర్తుచేశారు.

మరోవైపు భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రైస్‌ తెలిపారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు శాంతియుత పరిష్కారానికి దారితీయాలని ఆకాంక్షించారు. పొరుగుదేశాలతో చైనా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆందోళనకరంగా ఉందన్నారు. బెదిరింపు ధోరణిని మానుకోవాలని డ్రాగన్‌కు సూచించారు.

ఇవీ చదవండి..

ఆ పరికరంపైనే ‘అణు’మానాలు

ఆజాద్‌కు వీడ్కోలు.. మోదీ కంటతడి


మరిన్ని