అమెరికాలో వీసా బ్యాన్‌ ఉపసంహరణ..! 
అమెరికాలో వీసా బ్యాన్‌ ఉపసంహరణ..!  

 బైడెన్‌ కీలక నిర్ణయం

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో ఇబ్బందుల్లో ఉన్న అమెరికాలోని కార్మికుల అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే కారణంతో ట్రంప్‌ సర్కారు వలసదారులు అమెరికాలో ప్రవేశించడాన్ని నిషేధిస్తూ తీసుకొచ్చిన ఆదేశాలను బైడెన్‌ నేడు ఉపసంహరించుకొన్నారు. ఇది వీసా లబ్ధిదారులను ఇబ్బంది పెట్టడంతోపాటు.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని బైడెన్‌ వ్యాఖ్యానించారు. ఈ ఆదేశాలు అమెరికా నాగరికుల కుటుంబ సభ్యులతో కలవనీయకుండా చేస్తుందని.. దీంతో పాటు దేశానికి హాని చేస్తుందని ఆయన వివరించారు. అమెరికా సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను వినియోగించుకోనీయకుండా చేస్తుందని తెలిపారు. అంతేకాదు 2020 సంవత్సరం వీసాలు పొందిన, పొందాలనుకున్న వారికి నష్టదాయకంగా మారిందన్నారు.

ది డైవెర్సిటీ వీసా ప్రోగ్రాం (గ్రీన్‌కార్డ్‌ లాటరీ) ప్రొగ్రామ్‌పై ట్రంప్‌ నిర్ణయం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. ఈ కార్యక్రమం కింద అమెరికా ఏటా 55వేల మందికి గ్రీన్‌కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని దీనిని ప్రారంభించింది. ఇమ్మిగ్రేషన్‌ అటార్ని కర్టిస్‌ మారిసన్‌ మాట్లాడుతూ బైడెన్‌ది గొప్ప నిర్ణయం అన్నారు. అసలైన పని ఇప్పుడే మొదలైందన్నారు. దాదాపు 5లక్షల అర్హులైన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వెల్లడిస్తున్నారు. బైడెన్‌ నిర్ణయంతో డీవీ లాటరీ విజేతలు, వీసా దరఖాస్తు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 


Advertisement

Advertisement


మరిన్ని