ఐసీసీ సిబ్బందిపై ఆంక్షలు తొలగించిన అమెరికా!
ఐసీసీ సిబ్బందిపై ఆంక్షలు తొలగించిన అమెరికా!

వాషింగ్టన్‌: అమెరికా నుంచి వీసా పరమైన ఆంక్షలను ఎదుర్కొంటున్న అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) అధికారులకు కాస్త ఊరట లభించింది. గతంలో ట్రంప్‌ ప్రభుత్వం వారిపై విధించిన వీసా ఆంక్షల్ని బైడెన్‌ సర్కారు ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.  ‘అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) అధికారులపై ట్రంప్‌ ప్రభుత్వ హయాంలో విధించిన వీసాపరమైన ఆంక్షల్ని బైడెన్‌ సర్కారు ఉపసహరించుకుంది. ఈ నిర్ణయం ఫలితంగా ఐసీసీ ప్రాసిక్యూటర్‌ ఫటౌ బెన్‌సౌడా, ఐసీసీ సహకార విభాగం అధిపతి ఫకిసో మోచోచోకోపై గత ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. ఇదే సమయంలో అఫ్గానిస్థాన్‌, పాలస్తీనాకు సంబంధించిన అంశంలో అమెరికాకు వ్యతిరేకంగా ఐసీసీ చేపడుతున్న చర్యలను మేం తీవ్రంగా విభేదిస్తున్నాం’ అని బ్లింకెన్‌ ప్రకటనలో తెలిపారు.

అఫ్గానిస్థాన్‌లో 2003-2014 మధ్యకాలంలో అమెరికా దుశ్చర్యలకు పాల్పడిందని ఆరోపిస్తూ.. ఐసీసీ విచారణకు ఆదేశించాలని న్యాయవాది ఫటౌ బెన్‌సౌడా న్యాయస్థానాన్ని కోరారు. ఆయన వినతిని అప్పట్లో ఐసీసీ సైతం స్వీకరించింది. దీంతో ఆగ్రహించిన అమెరికా ప్రభుత్వం.. న్యాయస్థానానికి చెందిన అధికారులపై వీసా నిబంధనల్ని కఠినతరం చేస్తూ ఆంక్షలు విధించింది. వారి కుటుంబసభ్యులకూ ఇవే ఆంక్షలు వర్తిస్తాయని ప్రకటించింది. 


మరిన్ని