అమెరికాలో సిక్కు యువకుడిపై దాడి
అమెరికాలో సిక్కు యువకుడిపై దాడి

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలో ఆసియా వాసులపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బ్రూక్లిన్‌లోని  ఒక హోటల్‌లో సుమిత్‌ అహ్లూవాలియా అనే సిక్కు యువకుడిపై ఓ నల్లజాతీయుడు సుత్తితో దాడిచేసి గాయపర్చాడు. దాడి సమయంలో ఆ వ్యక్తి ‘‘నువ్వంటే నాకు ఇష్టంలేదు. నీ శరీరరంగు నాలాగా లేదు’’ అంటూ పెద్దగా కేకలు పెట్టారు. జాతి వివక్ష కోణంలో ఈ దాడి జరిగిందా? అనే అంశంపై అధికారులు విచారణ మొదలుపెట్టారు.

ఈ ఘటనపై సుమిత్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. ‘‘ఏప్రిల్‌ 26వ తేదీన బ్రౌన్స్‌విల్లేలో నేను పనిచేస్తున్న ది క్వాలిటీ ఇన్‌ హోటల్‌లో ఒక నల్లజాతీయుడు వచ్చాడు. అతడు లాబీలోకి చేరి పెద్దపెద్దగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడే ఉన్న రిసెప్షనిస్టు అతడికి ఏమి కావాలని ప్రశ్నించింది. అదే సమయంలో నేను వెళ్లి అతనితో మాట్లాడాను. కానీ, ప్రయోజనం లేకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని పిలిచాను. అదే సమయంలో అతడు కోపంతో రగిలిపోతూ జేబులో చేతులుపెట్టుకొని నావైపు వేగంగా వచ్చాడు. అతడి వద్ద తుపాకీ ఉందని నేను భయపడ్డాను. నువ్వు నా సోదరుడివి అంటూ అతన్ని అనునయించే ప్రయత్నం చేశాను. కానీ, ‘నీ చర్మం రంగు నా చర్మం రంగు వేరు.. ’ అంటూ అతడు జేబులో నుంచి సుత్తి బయటకు తీసి నా తలపై దాడి చేశాడు’’ అని సుమిత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై తొలుత ఫిర్యాదు చేయకుండా గాయంతోనే సుమిత్‌ ఇంటకి వెళ్లిపోయాడు. ఆరోజు రాత్రి నొప్పి పెరగడంతో నిద్రపట్టలేదు. ఆ తర్వాత డాక్టర్‌ వద్దకు వెళ్లి చికిత్స తీసుకొని తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమిత్‌కు ఓ సిక్కు సంస్థ న్యాయసహాయం అందిస్తానని పేర్కొంది. మార్చిలో ఒక ఆసియన్‌ అమెరికన్‌ వ్యక్తి, అతడి పిల్లలపై దాడి జరిగిన విషయం తెలిసిందే.


మరిన్ని