అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి

వాషింగ్టన్‌: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో బుధవారం కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఓరెంజ్‌ నగరంలోని ఓ వాణిజ్య భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక చిన్నారి సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రగాయాల పాలయ్యాడు. 

ఓరెంజ్‌ పోలీస్‌ ప్రతినిధి జెన్నీఫర్‌ దాడికి సంబంధించిన సమాచారాన్ని మీడియాకు వెల్లడించారు. ‘నగరంలోని ఓ వాణిజ్య సముదాయంలో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో పోలీసులుకు నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, దాడికి గల కారణాలేంటనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు’ అని జెన్నీఫర్‌ తెలిపారు. కాగా, రెండు వారాల వ్యవధిలో అమెరికాలో కాల్పుల సంఘటనలు చోటుచేసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 

ఇటీవల అట్లాంటాలో వేర్వేరు మసాజ్‌ పార్లర్లపై గుర్తుతెలియని వ్యక్తి జరిపిన దాడిలో ఎనిమిది మంది మరణించిన విషయం తెలిసిందే. బాధితుల్లో ఎక్కువ మంది ఆసియన్‌ అమెరికన్లే. దీంతో ఆసియన్‌ అమెరికన్లపై హింస ఆపాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సహా పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. ఇలాంటి దాడులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని బైడెన్‌ హెచ్చరించారు. 


మరిన్ని