దిగ్విజయంగా సాగిన కెనడా-అమెరికా తెలుగు సాహితీ సదస్సు
దిగ్విజయంగా సాగిన కెనడా-అమెరికా తెలుగు సాహితీ సదస్సు

ఇంటర్నెట్‌డెస్క్‌ : కెనడా-అమెరికా తెలుగు సాహితీ సదస్సు-2021 దిగ్విజయంగా సాగింది. సెప్టెంబర్‌ 25-26వ తేదీల్లో ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో 50% కెనడియన్ రచయితలు, 50% అమెరికా రచయితలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కవితలు, కథలు, ప్రసంగాల రూపంలో తమ ప్రతిభని ప్రదర్శించారు. ఈ సదస్సుతో అమెరికా-కెనడా రచయితల మధ్య పరిచయాలు, సత్సంబంధాలు పెరిగి, ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యం మరింత బలపడింది. మొదటి సారి సదస్సులో పాల్గొన్న అనేకమంది కెనడా రచయితలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

సరిహద్దు గీతని చెరిపేస్తూ కెనడా-అమెరికా రచయితలందరూ ఎంతో సంబరంగా జరుపుకొన్న ఇలాంటి పండుగలు తరచూ జరగాలనీ.. మున్ముందు కూడా రెండు దేశాలూ కలిసి సదస్సులు నిర్వహించాలనీ అనేకమంది మిత్రులు, శ్రేయోభిలాషులూ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సదస్సును 12 వేదికలుగా విభజించారు. ప్రతి వేదిక నిర్వహకులు, సాంకేతిక నిపుణులు..  తమ వేదిక మీద ప్రసంగించాల్సిన అనేక మంది రచయితలతో కలిసి సమావేశాలు నిర్వహించారు. సందేహ నివృత్తి చేసి, జూం నిర్వహణలో అంతరాయం కలగకుండా, సభని సమర్థవంతంగా కొనసాగించారు. ఇక సభని అందంగా తీర్చిదిద్దడంలో జూం హోస్ట్ ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచారు. సదస్సుల విషయంలో అనుభవం లేని వారిని వేలు పట్టుకుని నడిపిస్తూ.. ఎంతో ఓర్పుతో  ప్రతి విషయాన్నీ వివరిస్తూ.. అతి క్లిష్టమైన విషయాలని సులభంగా పరిష్కరిస్తూ,  సహనానికి మారుపేరుగా నిలిచిన వంగూరి చిట్టెన్రాజుకు కెనడా తెలుగువారి తరఫున ధన్యవాదాలు తెలిపారు.

‘తెలుగుతల్లి’ కెనడా వెబ్ మాసపత్రిక సంపాదకురాలు లక్ష్మీ రాయవరపు అకుంఠిత దీక్ష, మొక్కవోని సంకల్పంతో ఈ సదస్సు విజయవంతమయ్యేందుకు కృషి చేశారు. కెనడా మంత్రి ప్రసాద్ పండా, తెలుగు సినీ రచయితలు తనికెళ్ల  భరణి , సుద్దాల అశోక్ తేజ, వడ్డేపల్లి కృష్ణ, డేనియల్ నాజర్, భువనచంద్ర , బలభద్రపాత్రుని రమణి, మహెజబీన్ తదితరులు సదస్సుకు హాజరై తమ ప్రసంగాలతో ప్రేక్షకులను అలరించారు.

వంగూరి ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా వెబ్ మాస పత్రిక, టొరొంటో తెలుగు టైమ్స్‌, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగు వాహిని, ఒట్టావా తెలుగు అసోసియేషన్, కాల్గేరీ తెలంగాణ అసోసియేషన్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరొంటో కలిసి ఈ సదస్సుని విజయవంతంగా నిర్వహించాయి.


Advertisement

Advertisement


మరిన్ని