కరోనాపై చైనా జవాబుదారీగా ఉండాల్సిందే..!
కరోనాపై చైనా జవాబుదారీగా ఉండాల్సిందే..!

మరోసారి స్పష్టం చేసిన అమెరికా

వాషింగ్టన్‌: యావత్‌ ప్రపంచం సంక్షోభంలోకి వెళ్లడానికి కారణమైన కొవిడ్‌-19 మహమ్మారిపై చైనా జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉందని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది. కొవిడ్‌-19కు మూలమైన చైనా, వైరస్‌పై పారదర్శకంగా ఉండడంతో పాటు జవాబుదారీగా ఉండాల్సిందేనని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ పేర్కొన్నారు. ఇక భవిష్యత్తులో సంభవించే మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు బలమైన వ్యవస్థలను నిర్మించుకోవాలని అభిప్రాయపడ్డారు.

‘మరో మహమ్మారిని సాధ్యమైనంత వరకు నిర్మూలించడమే మనముందున్న అసలైన సవాల్‌. ఇందుకోసం అమెరికా కూడా ప్రయత్నిస్తోంది. ఒకవేళ మరో మహమ్మారి వచ్చిన నేపథ్యంలో వాటి వల్ల కలిగే ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలి’ అని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ కోరారు. కొవిడ్‌-19 వంటి మహమ్మారులు విజృంభించిన సమయంలో వాటికి సంబంధించిన సమాచారాన్ని అన్ని దేశాలకు అందుబాటులో ఉంచడంపై పారదర్శకత పాటించాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన దర్యాప్తు నివేదికపై పలు అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఆంటోనీ వ్యాఖ్యలు కీలకప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

డబ్ల్యూహెచ్‌ఓ నివేదికపై ఆందోళన..

కొవిడ్‌ మూలాలపై సమాచారాన్ని యావత్‌ ప్రపంచానికి తెలియజెప్పడంలో చైనా అంతర్జాతీయ నిబంధనలు పాటించడం లేదని అమెరికా విదేశాంగశాఖ ఆరోపించింది. ముఖ్యంగా కొవిడ్‌ మూలాలపై నివేదిక రూపొందించడానికి డబ్ల్యూహెచ్‌ఓ అనుసరించిన విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ పేర్కొన్నారు. దర్యాప్తు చేపట్టిన డబ్ల్యూహెచ్‌ఓ బృందానికి చైనా సరైన సమాచారం అందించకపోవడమే ఈ ఆందోళనకు కారణమన్నారు. అయితే, దీనిపై నివేదిక ఏవిధంగా వస్తుందో చూద్దాం అని ఆంటోని బ్లింకెన్‌ వ్యాఖ్యానించారు. చైనా నుంచి ఎదురవుతోన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అమెరికా మిత్రదేశాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన మరోసారి నొక్కిచెప్పారు.

Advertisement

Advertisement


మరిన్ని