జో బైడెనే అధ్యక్షుడు!
జో బైడెనే అధ్యక్షుడు!

ధ్రువీకరించిన అమెరికా కాంగ్రెస్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడి ఎన్నికపై నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు తెరపడింది. డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌, కమలా హారిస్‌ల విజయాన్ని అమెరికా కాంగ్రెస్‌ ధ్రువీకరించింది. నవంబర్‌ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరే గెలిచినట్లు వెల్లడించింది. అధ్యక్షుడిగా జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌లు అధికారికంగా ప్రకటించినట్లయ్యింది. దీంతో ఈ నెల 20వ తేదీన బైడైన్‌ 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

అమెరికాలో 538 ఎలక్టోరల్‌ ఓట్లుండగా, అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 270 ఓట్లు పొందాల్సి ఉంది. అయితే,  గత నవంబర్‌ 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌కు 306 ఓట్లు వచ్చాయి. అంతేకాకుండా 8కోట్ల 12లక్షల(51.3శాతం) ఓట్లను సాధించారు. ఇక రిపబ్లికన్‌ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు 232 ఓట్ల మద్దతు మాత్రమే లభించినప్పటికీ దాదాపు 7కోట్ల 42లక్షల (46.8శాతం) ఓట్లను మాత్రం పొందగలిగారు. వీటిని ఇప్పటికే ఎలక్టోరల్‌ కాలేజీ ధ్రువీకరించింది. తాజాగా యూఎస్‌ కాంగ్రెస్‌ ధ్రువీకరించడంతో జో బైడెన్‌ ఎన్నిక అధికారికమైంది.

ఇదిలాఉంటే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశమైన సమయంలో అక్కడి క్యాపిటల్‌ భవనం వద్ద తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్‌ భవనంలోకి దూసుకొచ్చారు. దీంతో  పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు.

ఇదీ చదవండి..  ‘క్యాపిటల్‌’ దాడి: ట్రంప్‌పై వేటు తప్పదా?మరిన్ని