అమెరికా విదేశీ విద్యార్థుల్లో 47 శాతం చైనా, భారత్‌ వారే..
అమెరికా విదేశీ విద్యార్థుల్లో 47 శాతం చైనా, భారత్‌ వారే..

 2020లో కొత్త చేరికలపై కరోనా తీవ్ర ప్రభావం

వాషింగ్టన్‌: అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో (2020లో) 47 శాతం మంది భారత్, చైనా దేశస్థులేనని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో కొత్తగా చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు తెలిపింది. ఈ మేరకు ‘యూఎస్‌ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌’లో భాగంగా ‘స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌’ వార్షిక నివేదికను వెల్లడించింది. ‘సెవిస్‌’ పేరిట వెబ్‌ ఆధారిత విధానంలో అమెరికాలోని అంతర్జాతీయ నాన్‌ఇమ్మిగ్రెంట్‌ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్లకు సంబంధించిన ఈ సమాచారాన్ని పొందుపరుస్తారు.
* ‘సెవిస్‌’ రికార్డుల ప్రకారం 2020లో అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో 5,90,021 (47%) మంది చైనా (3,82,561), భారత్‌ (2,07,460)లకు చెందినవారే. 2019లో ఈ రెండు దేశాలకు చెందిన వారు 48% ఉన్నారు.
* అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో చైనా, భారత్‌ల తర్వాత స్థానాల్లో దక్షిణ కొరియా (68,217), సౌదీ అరేబియా (38,039), కెనడా (35,508), బ్రెజిల్‌ (34,892)లకు చెందిన వారున్నారు.
* 2019తో పోలిస్తే 2020లో ఎఫ్‌-1 (అమెరికాలోని కాలేజీలు లేదా విశ్వవిద్యాలయాల్లో అకడమిక్‌/ఇంగ్లీష్‌ లాంగ్వేజి ప్రోగ్రామ్స్‌ చేసే అంతర్జాతీయ విద్యార్థులకిచ్చే వీసా), ఎం-1 (ఒకేషనల్, టెక్నికల్‌ స్కూళ్లలో విద్యాభ్యాసానికి వచ్చేవారికి కేటాయించే వీసా) కలిపి విద్యార్థుల సంఖ్య 17.86 శాతం తగ్గిపోయింది.
* 2019తో పోలిస్తే 2020లో అమెరికా స్కూళ్లలో న్యూ ఇంటర్నేషనల్‌ ఎన్‌రోల్‌మెంట్‌ (కొత్తగా చేరికలు) 72 శాతం పడిపోయింది. 
* ఆసియా నుంచి చదువుల కోసం అమెరికాకు వెళ్లేవారిలో చైనా, భారతీయులే అత్యధికం కాగా 2019తో పోలిస్తే 2020లో చైనా పంపించిన విద్యార్థుల సంఖ్య 91,936 తగ్గిపోగా, భారత్‌ నుంచి 41,761 మంది తగ్గారు.
* 2020లో అమెరికాలోని మొత్తం ఎఫ్‌-1, ఎం-1 విద్యార్థుల్లో 44 శాతం మంది మహిళలు (5,52,188) కాగా 56 శాతం మంది పురుషులు (6,98,964). భారత విద్యార్థుల్లో 35 శాతం మంది మహిళలు కాగా 65 శాతం మంది పురుషులు. చైనాలో స్త్రీ, పురుష విద్యార్థులు వరుసగా 47%, 53% ఉన్నారు.

Advertisement

Advertisement


మరిన్ని